కో–వర్కింగ్, కో–లివింగ్‌లకు మంచి భవిష్యత్తు

Realtors bullish on growth of co-working, co-living segments - Sakshi

నరెడ్కో, కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాలలో కో–వర్కింగ్, కో–లివింగ్‌ ప్రాజెక్ట్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. నరెడ్కో, కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంయుక్తంగా ‘కోవిండ్‌ అనంతరం కో–వర్కింగ్‌ అండ్‌ కో–లివింగ్‌ వృద్ధి’ అనే అంశం మీద వెబినార్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా నరెడ్కో ప్రెసిడెంట్‌ నిరంజన్‌ హిరానందాని మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద సంస్థల నుంచి ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ కోసం డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. గతంలో సొంత ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చే చాలా కంపెనీలు కరోనా తర్వాతి నుంచి కో–వర్కింగ్‌ స్పేస్‌ కోసం వెతుకుతున్నారని చెప్పారు. కోవిడ్‌తో విద్యా సంస్థల మూసివేత, వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా కో–లివింగ్‌ విభాగం మీద ప్రభావం చూపించిందని తెలిపారు.

కో–లివింగ్‌లో స్టూడెంట్‌ హౌసింగ్‌ రాబోయే రెండేళ్లలో విపరీతమైన వృద్ధిని చూడనుందని చెప్పారు. విద్యా సంస్థలు పెద్ద ఎత్తున హాస్టల్‌ గృహాలను నిర్మించవని.. విద్యార్థి గృహల నిర్వాహకులతో భాగస్వామ్యం చేసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా, సౌత్‌ఈస్ట్‌ ఏషియా ఎండీ అన్షుల్‌ జైన్‌ మాట్లాడుతూ.. గతంలో కంటే కో–వర్కింగ్‌ స్పేస్‌ ఆకర్షణీయంగా మారిందన్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాలతో తాత్కాలిక కాలం పాటు ఈ విభాగం మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ రెండు రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కంపెనీలు మూలధన పెట్టుబడుల పొదుపు, సౌకర్యం, వ్యయాల తగ్గింపు వంటి కారణంగా కో–వర్కింగ్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఏర్పడుతుందని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top