రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం స్థలాల కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొంత నీరసించాయి. 2,994 ఎకరాలను రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇందులో సగం మేర లిస్టెడ్ రియల్టీ కంపెనీలు కొనుగోలు చేసినవే కావడం గమనార్హం.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2025–26లో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధికి కోసం గాను, 2,994 ఎకరాలకు సంబంధించి 111 భూముల కొనుగోలు లావాదేవీలు నమోదయ్యాయి. 2024–25లో 3,071 ఎకరాలకు సంబంధించి 143 లావాదేవీలు జరగడం గమనార్హం. ప్రతి రెండు లావాదేవీల్లో ఒకటి లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ రూపంలోనే ఉన్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.
1,433 ఎకరాలకు సంబంధించి 54 కొనుగోలు లావాదేవీలు లిస్టెడ్ కంపెనీల రూపంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వడోదర, అమృత్‌సర్, నాగ్‌పూర్, పానిపట్, మైసూర్, రాయిపూర్, కోయింబత్తూర్ తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో భూములను సమీకరించాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్, లోధా డెవలపర్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ చురుగ్గా వ్యవహరించాయి.
‘‘లిస్టెడ్ సంస్థలు క్రమంగా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. కస్టమర్లు బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండడం వీటికి డిమాండ్‌ను పెంచుతోంది. భూముల కొనగోలు అన్నది భారీ పెట్టుబడి నియంత్రణలతో ముడిపడిన అంశం. అందుకే అసంఘటిత రంగంలోని సంస్థలు, చిన్న డెవలపర్ల కంటే లిస్టెడ్ రియల్టీ కంపెనీలకు సానుకూలత ఎక్కువగా ఉంటోంది’’అని అనుజ్ పురి వివరించారు.


