డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది.
మార్పులు ఏమిటంటే..
కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.
రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్‌స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.
రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.
అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.
ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.
ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.
అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.
ముందస్తు హెచ్చరికలు తప్పనిసరి
కస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్‌కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.


