ఎక్కడి రేట్లు అక్కడే! ఆర్బీఐ పాలసీ మీట్‌ నేటి నుంచే.. | RBI Likely to Hold Interest Rates Steady MPC Meeting Begins Today | Sakshi
Sakshi News home page

ఎక్కడి రేట్లు అక్కడే! ఆర్బీఐ పాలసీ మీట్‌ నేటి నుంచే..

Apr 6 2026 7:55 AM | Updated on Apr 6 2026 8:41 AM

RBI Likely to Hold Interest Rates Steady MPC Meeting Begins Today

ముంబై: ఆర్‌బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, యథాతథంగా కొనసాగించొచ్చని విశ్లేషకులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ మూడు రోజుల సమీక్ష 6న ప్రారంభం కానుంది. 8వ తేదీన (బుధవారం) కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ కుమార్‌ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.

గత సమీక్షలో రెపో రేటు 5.25 శాతంలో ఎలాంటి మార్పు చేయని విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, కమోడిటీల ధరలు గరిష్టాల్లో ట్రేడ్‌ అవుతుండడం, రూపాయి మారకం విలువలో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో ఆర్‌బీఐ రేట్ల సవరణకు మొగ్గు చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘‘చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల అనిశ్చితుల నేపథ్యంలో ఆర్‌బీఐ ఏప్రిల్‌ పాలసీ సమీక్షలో రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాటవేయొచ్చు. ద్రవ్యోల్బణం డేటాను లోతుగా పరిశీలించిన తర్వాతే రేట్లపై తదుపరి నిర్ణయానికి రావొచ్చు’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ సైతం అంచనా వేశారు.

చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరడం, రూపాయి డాలర్‌తో 93కు పడిపోవడం, సూపర్‌ ఎల్‌నినో అంచనాలు ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లను పెంచొచ్చన్నారు. స్వల్పకాల పరిణామాల ఆధారంగా రేట్లపై ఆర్‌బీఐ నిర్ణయానికి రాలేదని.. ద్రవ్యోల్బణం తీరుపై స్పష్టత వచ్చాకే రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త శక్తి గుప్తా అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement