న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్‌డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.
ప్రతిపాదిత పెన్షన్ చట్టం బిల్లులో ఎన్‌పీఎస్ ట్రస్ట్‌ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్‌పీఎస్‌ను పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి.


