10వేలతో కోటి రూపాయలు.. ఇలాంటివి గుడ్డిగా నమ్మొద్దు
సిప్‌లోనూ రిస్కులుంటాయి... తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి
‘గ్యారంటీ’ అని ఎవరు చెప్పినా నమ్మాల్సిన పనిలేదు
దీర్ఘకాలం వెనకాడకుండా కొనసాగిస్తేనే సిప్‌తో లాభం
స్వల్పకాలిక రాబడులకైతే వేరే మార్గాలు చూసుకోవాలి
‘‘నెలకు రూ.10వేలు పెట్టుబడి చాలు. అదే మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది’’
స్టాక్ మార్కెట్లలో ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపించే పదం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను (సిప్‌ను) ప్రోత్సహించే కంపెనీలు కావొచ్చు... ఇన్‌ఫ్లుయెన్సర్లు కావచ్చు... ఇన్వెస్ట్‌మెంట్ గురువులు కావొచ్చు. అందరూ దీన్నో తారకమంత్రం మాదిరి జపిస్తుంటారు. నిజానికి ఇన్వెస్టర్లకు కూడా ఇదో హుక్ లాంటిది. కోటి రూపాయలనే టార్గెట్‌గా పెట్టుకుని, 10వేలతో సిప్ ప్రారంభించినవారు చాలామంది ఉన్నారు.
కాకపోతే వారంతా నిజంగా కోటి రూపాయలు సంపాదించారా? లేక నష్టాలొచ్చాయని మధ్యలోనే వదిలేసారా? ఒకవేళ కోటి రూపాయలు సంపాదిస్తే ఎంతకాలానికి సంపాదించి ఉంటారు? ఎంత క్రమశిక్షణ పాటించి ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే సిప్‌కు కావాల్సినవి ఇవే. సిప్ అంటే అదేదో మంత్రదండం కాదు. అక్షయపాత్ర కూడా కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయటం ద్వారా సంపద సృష్టించే ఒక సాధనం మాత్రమే. ఆ రిసు్కల్ని తెలియజేసేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...
రాబడికి గ్యారంటీ ఉండదు...
చాలా మంది నిర్ణిత కాలంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. దీనివెనుక అంచనాల్లో పొరపాట్లే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రాబడి విషయంలోనే ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు.
→ ఈక్విటీల్లో పెట్టుబడిపై ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తుందని అనుకుంటుంటారు.
→ ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని భావిస్తుంటారు.
→ ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. సిప్‌తో రిస్క్ ఉండదని అనుకుంటుంటారు.
→ కానీ ఇవేవీ నిజం కావు.
వాస్తవాలను తెలుసుకోవాలి...
→ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల మాదిరి ఈక్విటీల్లో రాబడులు స్థిరంగా ఉండవు.
→ ఈక్విటీ రాబడులు అన్నవి మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయన్న డిస్‌క్లోజర్‌ను తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి.
→ మార్కెట్ ర్యాలీల్లో 15 శాతమే కాదు. 18– 25– 35 శాతం వార్షిక రాబడులు వచి్చన సందర్భాలు కూడా ఉన్నాయి.
→ కానీ ఆటుపోట్ల తరుణంలో రాబడులు 10–12 శాతం మించకపోవచ్చు.
→ మరీ ముఖ్యంగా ప్రతికూల సమయాల్లో సగటు వార్షిక రాబడి 7–9 శాతం మించకపోవచ్చు. ఒకోసారి అంతకన్నా తక్కువకూడా రావచ్చు.
→ ఇక సిప్ తొలినాళ్లలో అయితే (మూడేళ్లలోపు) మార్కెట్ దిద్దుబాట్లు ఎదురైతే.. రాబడి కాదు, నష్టాలకూ స్వాగతం పలకాల్సి వస్తుంది.
→ పైన కొటేషన్‌లో చెప్పుకున్నట్టు ప్రతి నెలా రూ.10,000తో 20 ఏళ్లలో కోటికి అధిపతి కావాలంటే వార్షిక రాబడి 12.7 శాతం తక్కువ కాకుండా ఉండాలి.
ఉదాహరణలు..
→ 2020 మార్చిలో కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు 40% నష్టపోవడం తెలిసిందే.
→ 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే పెరుగుతూ, తగ్గుతూ, స్థిరీకరణకు గురవుతున్నాయి.
→ కానీ వైరస్‌పై కొంత స్పష్టత రావడంతో మార్కెట్లు వెంటనే రివర్స్‌గేర్ తీసుకున్నాయి. 2023 వరకు ర్యాలీ చేశాయి. ఈ కాలంలో సిప్ రాబడులు అద్భుతంగా ఉన్నాయి.
రిస్క్ లూ ఉంటాయ్..
→ అనుకున్న కాలానికి అనుకున్నంత సమకూరాలంటే అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చు.
→ మార్కెట్లు సైడ్‌వేస్ (ఓ పరిధిలోనే)లో ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చు. దీనివల్ల దీర్ఘకాల రాబడులు తగ్గిపోతాయి.
→ పక్కా ప్లాన్‌తో సిప్ చేసినా.. ఫండ్ ఎంపిక సరిగ్గా లేకపోతే చివర్లో అనుకున్నంత రాబడి సాధ్యం కాదు.
ప్రవర్తనా లోపాలే ఎక్కువ...
→ కొంత మంది ఆదాయం సర్దుబాటు చేయలేక సిప్‌లను మధ్యలోనే ఆపేస్తుంటారు.
→ కొంత మంది మార్కెట్లు పడిపోతున్నాయని చెప్పి నష్టాలను చూసి భయంతో సిప్‌కు టాటా చెబుతుంటారు.
→ మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఉత్సాహం కొద్దీ అధిక వ్యాల్యూషన్ల వద్ద అదనంగా సిప్ చేస్తుంటారు.
→ అదే మార్కెట్ల పతనాల్లో మాత్రం నమ్మకం సడలి ఉన్న సిప్‌లను ఆపేస్తుంటారు. కానీ, నిజానికి పతనాల్లోనే సిప్‌లకు అదనంగా జోడించుకోవడం తెలివైన పని.
→ కొందరు ఒక లక్ష్యం, స్పష్టత లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. లక్ష్యం, కాల వ్యవధి ఆధారంగా సరితూగే పథకాలనే ఎంపిక చేసుకోవాలి.
→ నిపుణుల సూచనలు కాకుండా స్నేహితులో, సహచర ఉద్యోగో లేక బంధువు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి వద్దు.
→ స్వల్పకాల కోసం సిప్ చేయడం సరికాదు. సిప్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనం.
→ గడిచిన ఏడాది కాలంలో మంచి పనితీరు చూపించిన (అప్పటికే బాగా పెరిగిన) ఫండ్స్‌లో సిప్ చేయడం సరికాదు.
→ పెట్టుబడి తక్కువ మొత్తమే అయినా ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని అతి వైవిధ్యంగా చెబుతారు. ఇది కూడా తప్పే.
ఇదీ వాస్తవం..
→ సిప్‌పై దీర్ఘకాలంలో రాబడి 10–12 శాతంగానే ఉంటుందన్న అంచనా వాస్తవికం. 15–20 శాతం అంచనా వేసుకోకూడదు.
→ కనీసం 10–15 ఏళ్ల పాటు అయినా స్థిరంగా సిప్ చేసుకుంటూ వెళ్లాలి.
→ మార్కెట్ టైమింగ్ (ఎప్పుడు ఎటు కదులుతుందో అంచనా) కాకుండా క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి.
→ సిప్ అన్నది పవర్‌ఫుల్ టూల్. అద్భుతమైన మంత్రదండం కాదు. కానీ, క్రమశిక్షణతో దీర్ఘకాలంలో సిప్ చేస్తే సంపద సాధ్యం.
→ అవాస్తవిక అంచనాలతో ముందుకెళితే చివర్లో ఫలితం నిరాశకు గురి చేయొచ్చు.
ముందు మొదలెడితే... మ్యాజిక్
→ నెలకు రూ.10,000 చొప్పున 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఏటా 12 శాతం రాబడి అంచనా ఆధారంగా రూ.91.98 లక్షలు
సమకూరుతుంది.
→ 20 ఏళ్లకు బదులు మరో 5 ఏళ్లు పెంచి 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.70 కోట్లు సమకూరుతుంది. అంటే ఐదేళ్లలో రూ.78 లక్షలు అదనంగా వస్తుంది.
→ 30 ఏళ్ల పాటు ఇంతే మేర ఇన్వెస్ట్ చేస్తే సమకూరే సంపద రూ.3.08 కోట్లు.
→ ప్రతి నెలా 10వేలు చొప్పున, ఏటా 10 శాతం అదనంగా సిప్ పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే.. (12 శాతం రాబడి అంచనా ఆధారంగా)
→ 20 ఏళ్లలో రూ.1.86 కోట్ల సొమ్ము సమకూరుతుంది.
→ 25 ఏళ్లలో రూ.3.93 కోట్లు ఏర్పడుతుంది.
→ 30 ఏళ్లలో రూ.7.98 కోట్ల నిధి సొంతం అవుతుంది.


