బంగారం దిగుమతులు: ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

Do you know the RBI guidelines on gold import by qualified jewellers - Sakshi

బంగారం దిగుమతుల్లో  మరింత పారదర్శకత

ముంబై: బంగారం భౌతిక దిగుమతుల్లో మరింత పారదర్శకత లక్ష్యంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం కీలక నిబంధనలు జారీ చేసింది. ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ (ఐఐబీఎక్స్‌) లేదా భారతదేశంలోని క్వాలిఫైడ్‌ జ్యువెలర్ల అధికారిక ఎక్సే్ఛంజ్‌ ద్వారా పసిడి దిగుమతులకు ఉద్దేశించి ఈ నిబంధనలను రూపొందించడం జరిగిందని సెంట్రల్‌ బ్యాంక్‌ పేర్కొంది.

ఆర్‌బీఐ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ద్వారా నామినేట్‌ అయిన ఏజెన్సీలతో పాటు, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) ఆమోదించిన క్వాలిఫైడ్‌ జ్యువెలర్స్‌ (క్యూజే) బంగారం దిగుమతికి గత జనవరిలో సెంట్రల్‌ బ్యాంక్‌ అనుమతించింది. అయితే  దిగుమతులకు సంబంధించిన తాజాగా నిబంధలు జారీ అయ్యాయి.

నిబంధనావళి ప్రకారం... 
♦ ఐఎఫ్‌ఎస్‌సీ చట్టం కింద జారీ అయిన విదేశీ వాణిజ్య విధానం, నిబంధనలకు అనుగుణంగా ఐఐబీఎక్స్‌ ద్వారా బంగారం దిగుమతి కోసం క్వాలిఫైడ్‌ జ్యువెలర్‌లు బ్యాంకులకు 11 రోజుల ముందస్తు చెల్లింపులు చేయవచ్చు.

♦ బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు ముందస్తుగా చెల్లించే సొమ్ముకు సంబంధించి రుణ సౌలభ్యతకు లేదా ముందస్తు చెల్లింపుల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు ఏ రూపంలోనూ అనుమతి ఉండదు.

♦ ఐఎఫ్‌ఎస్‌సీఏ అధీకృత ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా బంగారం దిగుమతికి సంబంధించి ముందస్తు చెల్లింపులు, దిగుమతులు కార్యరూపం దాల్చకపోవడం, లేదా దిగుమతి ప్రయోజనం కోసం చేసిన అడ్వాన్స్‌ రెమిటెన్స్‌ అవసరమైన మొత్తం కంటే ఎక్కువగా ఉండడం, ఉపయోగించని అడ్వాన్స్‌లు తిరిగి చెల్లించడం వంటి లావాదేవీలను సంబంధిత బ్యాంక్‌లో నిర్దిష్ట 11 రోజుల కాలపరిమితిలోపు నిర్వహించే వీలుంది.

♦ ఐఐబీఎక్స్‌ ద్వారా బంగారం దిగుమతుల కోసం క్వాలిఫైడ్‌ జ్యువెలర్స్‌ చేసే అన్ని చెల్లింపులు ఐఎఫ్‌ఎస్‌సీఏ ఆమోదించిన విధంగా ఎక్స్‌ఛేంజ్‌ యంత్రాంగం ద్వారా జరుగుతాయి.

♦ 2022 ఏప్రిల్‌లో బంగారం దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 72 శాతం తగ్గి  6.23  బిలియన్‌ డాలర్ల నుంచి 1.72 బిలియన్‌ డాలర్లకు చేరిన నేపథ్యంలో తాజా నిబంధనావళి జారీ కావడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top