హైదరాబాద్‌లో డార్విన్‌బాక్స్‌ కొత్త హెడ్‌క్వార్టర్స్‌

Darwinbox Opens New Global Headquarters In Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల సంస్థ డార్విన్‌బాక్స్‌ హైదరాబాద్‌లో తమ కొత్త గ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల్లో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్‌ చెన్నమనేని సోమవారం తెలిపారు.

ప్రస్తుతం ఈ సంఖ్య 700గా ఉండగా, అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలో కలిపి దాదాపు 1,200 మంది ఉన్నట్లు ఆయన వివరించారు. కొత్తగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ తదితర విభాగాల్లో సిబ్బందిని తీసుకోనున్నట్లు చెప్పారు. 

మరోవైపు, రాబోయే మూడేళ్లలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు రోహిత్‌ వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ విభాగం లాభాలు నమోదు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా తదితర మార్కెట్లలో కార్యకలాపాలు మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు.

2015లో చైతన్య పెద్ది, జయంత్‌ పాలేటి, రోహిత్‌ చెన్నమనేని ప్రారంభించిన డార్విన్‌బాక్స్‌కు 700 పైచిలుకు క్లయింట్లు, దాదాపు 20 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో సమీకరించిన 72 మిలియన్‌ డాలర్ల నిధులతో యూనికార్న్‌ హోదా (బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌) దక్కించుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top