గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులే కీలకం
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్
ములకలచెరువు : రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన మండలంలో నరేగా నిధులతో మెయిన్‌రోడ్డు నుంచి కనుగొండరాయస్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలోగా రూ.75 కోట్లు నరేగా నిధుల ద్వారా మంజూరైన రహదారులు పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమంలో పూర్తి చేయాల్సిన 17 పనులను నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలను పాటించి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు మౌలిక సదుపాయాల నిర్మాణమే కీలకమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
మదనపల్లె : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా డ్రోన్ సేవలను పెంచి, పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, ఏపీఎమ్‌ఐపీ, పశుసంవర్ధక, మత్స్య, సహకార, మార్కెటింగ్, డీఆర్‌డిఏ, మార్క్‌ఫెడ్, ప్రైమరీ సెక్టార్ల అధికారులు, మండల ఏఓ, విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ–పంట నమోదు కార్యక్రమాన్ని వెనుకబడిన మండలాల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించకపోతే, మార్చి నెలలో పీఎం–కిసాన్ నిధులు జమ కావని, సంబంధిత రైతులకు గుర్తింపు ఇవ్వాలన్నారు. డ్రోన్ సేవలను రైతులు పొలాల్లో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మందుల పిచికారీ చేసుకోవచ్చని తద్వారా ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వ్యవసాయశాఖ క్యాబ్ బుకింగ్ తరహాలో వ్యవసాయ యంత్ర సేవలు పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.


