యువకుడు అనుమానాస్పద మృతి
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలానికి చెందిన ఓ యువకుడు అనుమానస్పదస్థిలో మృతి చెందాడు. డంబెల్‌తో కొట్టడంతో చనిపోయాడని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వెలుగు చూసిన ఘటనపై మృతుడి సోదరి తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. సీటీఎం గ్రామానికి చెందిన రామకృష్ణ, రమాదేవిల కుమారుడు కిరణ్ కుమార్(25) తల్లి దండ్రులు లేక పోవడంతో అక్క రమాదేవి, మరో అక్క మూగమ్మ దగ్గర ఉంటున్నాడు. కిరణ్ కుమార్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సురేష్ కుటుంబలో ఉండే ఆడ పిల్లను కిరణ్ కుమార్ ఏడిపించాడన్న అనుమానంతో మూడు రోజుల క్రితం, సురేష్ అతని స్నేహితులు ఊరి చివరకు తోడుకెళ్లి డంబెల్స్‌తో దారుణంగా కొట్టారని, దీంతో కిరణ్‌కుమార్ తలకు బలమైన గాయాలు ఏర్పడి మంచం పట్టినట్లు రమాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గొంతు కింద చారలు ఉండడంతో గుర్తించి, ప్రశ్నించడంతో టవల్‌తో గొంతుకు బిగించి సురేష్ , మరికొంత మంది కొట్టి దూరం ఈడ్చుకు పోయి చంపేందుకు ప్రయత్నించారని కిరణ్ తనకు తెలిపినట్లు ఆమె ఆరోపించింది. సురేష్ తన అనుచరులతో కొట్టడం వల్లే తన తమ్ముడు చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


