ఉలవ..వెలవిల !
ఉలవ పంటైనా గట్టెక్కిస్తుందని గంపెడాశలు పెట్టుకొన్న రైతులకు నిరాశే మిగిలింది. అసలే దిగుబడి రాక.. ఆపై ఉలవకు ‘వెల’ లేక.. నష్టాలే పలకరించడంతో రైతన్న కంట కన్నీరే మిగిలింది. చివరికి పంట పశుగ్రాసంగా మారింది.
గుర్రంకొండ : ఈ ఏడాది ఉలవ సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. జిల్లాలో వేరుశనగ సాగు అదును దాటిపోయిన తరువాత ప్రత్యామ్నాయ పంటగా ఇక్కడి రైతులు ఉలవసాగును ఎంచుకుంటారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఉలవ పంట ఎకరానికి రెండుక్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర రూ.32వరకు పలుకుతోంది. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రూ. 5.60 కోట్ల మేరకు రైతులు ఉలవసాగుతో నష్టపోయారు. గత రెండేళ్లుగా మార్కెట్లో ఇవే ధరలు పలుకుతుండడంతో రైతులకు కనీసం సాగు ఖర్చు కూడా మిగలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలువురు రైతులు తమ పొలాల్లో సాగు చేసిన పంటను కోయకుండా అలాగే వదిలేసి పశుగ్రాసంగా వినియోగించుకోవడం గమనార్హం.
జిల్లాలో 8650 ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ ఏడాది 8650 ఎకరాల్లో ఉలవపంటను సాగు చేశారు. సాధారణంగా వేరుశనగ పంట సాగు అదును దాటిపోయినాక ఉలవసాగుపై దృష్టిసారిస్తా రు. సెప్టెంబర్, అక్టోబర్‌నెలలో ఉలవపంట సాగు ప్రారంభమవుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట నూర్పిళ్లు ఉంటాయి. సాధారణంగా సాగు ప్రారంభమైన తరువాత రెండు నెలల పాటు సక్రమంగా వర్షాలు కురిస్తే ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల ఉలవ దిగుబడి వస్తుంది. మార్కెట్లో మంచి ధరలు ఉంటే రైతు సాగుకు ఖర్చుచేసిన పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తాయి.
ఈఏడాది 35 శాతానికి పడిపోయిన దిగుబడి
జిల్లాలో ఉలవ పంట సాగు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 35శాతం పంట దిగుబడి మాత్రమే వచ్చింది. గత ఎడాది సగటున ఎకరానికి రెండున్నర క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. అయితే ఈ ఎడాది విభిన్న వాతావరణ పరిస్థితులు, అదనుదాటి కురిసిన వర్షాల కారణంగా సగటున ఎకరానికి రెండు క్వింటాళ్ల పంట దిగుబడి మాత్రమే వచ్చింది. కాగా వచ్చిన పంట దిగుబడిలో గింజల బరువుశాతం భారీగా తగ్గిపోయి తేలిపోయింది. దీనికితోడు ధర కూడా పాతాళానికి పడిపోయింది. రెండేళ్ల క్రితం మార్కెట్లో ఉలవ ధర రూ.57నుంచి రూ.60 వరకు పలికాయి. ఈ ఏడాది రూ. 32కి పడిపోవడంతో ఎకరానికి రూ. 6500 చొప్పున రైతులు నష్టపోయారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 8650 ఎకరాల్లో పంటసాగు చేపట్టిన రైతులు రూ. 5.62 కోట్ల మేరకు నష్టపోయారు.
వ్యాపారులకు సైతం నష్టాలే..
రెండేళ్ల క్రితం ఉలవలు వ్యాపారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు భారీఎత్తున కొనుగొలు చేసి కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఒక్క ఏడాది కూడా మన రాష్ట్రంలో కోల్డ్‌స్టోరేజిల్లో వ్యాపారులు నిల్వ ఉంచిన ఉలవలను కొనుగో లు చేయలేదు. కర్ణాటకలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మన రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసింది.ప్రస్తుతం మార్కెట్లో ఉలవ ధర రూ.32మాత్రమే ఉంది. దీంతో కోల్డ్‌స్టోరేజిల్లో స్టాకు ఉంచుకొన్న వ్యాపారులు ఉలవలను ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
దిగుబడి రాక.. ధర లేక
ఈఏడాది నష్టాలు మిగిల్చిన ఉలవసాగు!
జిల్లాలో 8650 ఎకరాల్లో సాగైనపంట
రూ.5.62 కోట్ల మేర
రైతులకు పంటనష్టం
ఉలవ..వెలవిల !


