ఇకపై చిన్నక్రేట్లలో టమాట విక్రయాలు
మదనపల్లె : మార్చి నుంచి జిల్లాలోని అన్ని మార్కెట్‌యార్డుల్లో టమాట విక్రయాలు 15కిలో చిన్న క్రేట్ల ద్వారానే జరగాలని మార్కెటింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు స్పష్టం చేశారు. దీన్ని ఉల్లంఘించి క్రయ విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం స్థానిక మార్కెట్‌యార్డు కార్యాలయంలో మదనపల్లె, ములకలచెరువు, వాల్మీకిపురం మార్కెట్ చైర్మన్లు, కార్యదర్శులు, మండీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములకలచెరువు, మదనపల్లె, అంగళ్లు, వాయల్పాడు, గుర్రంకొండ టమాట మార్కెట్లలో చిన్న క్రేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మార్కెట్లో టమాటాలు విక్రయాలు చేసే రైతులకు ఏరోజు విక్రయాలకు ఆరోజే నగదు చెల్లింపు చేయాలని ఆదేశించారు. మార్కెట్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మండి యజమానులు, వ్యాపారస్తుల సమస్యలు, అందించాల్సిన సహకారంపై మదనపల్లె చైర్మన్ జంగాల శివరామ్ జేడీ దృష్టికి తెచ్చారు. వాల్మీకిపురం చైర్మన్ కోసూరు చంద్రశేఖర్, మార్కెట్ కార్యదర్శులు జగదీష్, ఎన్.నవీన్ కుమార్, ఎం.మదన్ మోహన్ రెడ్డి, వాయల్పాడు కార్యదర్శి సునీల్ పాల్గొన్నారు.
మార్కెటింగ్ ఆర్‌జేడీ రామాంజనేయులు


