ఇక ఉద్యమం ఉధృతం | YSRCP movement for irrigation projects in Rayalaseema | Sakshi
Sakshi News home page

ఇక ఉద్యమం ఉధృతం

Apr 17 2026 5:19 AM | Updated on Apr 17 2026 5:19 AM

YSRCP movement for irrigation projects in Rayalaseema

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమం  

మాజీ మంత్రి శైలజానాథ్‌ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్‌

సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘తెలంగాణ సీఎం అయిన శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం గురువు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టుపెట్టి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఆపించారు. దీనికి సిగ్గుపడాలి. రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన రాయలసీమకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాయలసీమ లిఫ్ట్‌ ఎందుకు అని ప్రశి్నస్తున్నారు. హంద్రీ–నీవా వెడల్పు చేయకుండా తగ్గించి లైనింగ్‌ చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ ఆపారు. 1995–2004 వరకు, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీమకు తీరని ద్రోహం చేశారు. 

ఈ ద్రోహంపై ఉద్యమించకపోతే మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేసినట్లే. గ్రామస్థాయి నుంచి ఉద్యమించి ప్రాజెక్టులు సాధించుకోవాలి!’ అని రాయలసీమ వైఎస్సార్‌సీపీ నేతలు ముక్తకంఠంతో నినదించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఆపేసిన క్రమంలో ‘సీమ ప్రాజెక్టులు–సమాలోచన’ పేరుతో కర్నూలులో గురువారం వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ అనంతపురం, నంద్యాల జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీమంత్రి సాకే శైలజానాథ్, కర్నూలు జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు విరూపాక్షి, బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. గ్రేటర్‌ రాయలసీమ నీటి అవసరాలు, భవిష్యత్‌ కాపాడుకునేందుకు గ్రామస్థాయి నుంచి ఉద్యమించాలని చెప్పారు. 

ప్రాజెక్టుల సాధనకు మాజీ మంత్రి శైలజానాథ్‌ ఆధ్వర్యంలో రాయలసీమపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్‌ సాధనకోసం అందరం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాగా, గుండ్రేవుల–వేదవతి ప్రాజెక్టులు వెంటనే పూర్తిచేయాలని, గ్రామస్థాయి నుంచి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలని, గుండ్రేవుల సాధన కోసం పాదయాత్ర చేయాలని, హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలని తీర్మానాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement