తిరుమల: అలంకార ప్రియునికి ప్రకృతి సొబగులు

Tirumala: Crowns And Flower Decoration To Lord Venkateswara - Sakshi

ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటాలు, మాలలు

స్నపన తిరుమంజనంలో స్వామి, అమ్మవార్లకు అలంకరణ

పవిత్రాలు, సజ్జ కంకుల అలంకారాలు ఈ సారి ప్రత్యేకం

విదేశీ ఫలపుష్పాలతో రంగనాయకుల మండపం శోభాయమానం 

తిరుమల: ఇల వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీనివాసుడు అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్నా రు. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన వాటితో పాటు దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు. వైఖానస ఆగమోక్తంగా శ్రీవారి ఉత్సవాల్లో పూటకో అలంకరణ చేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.
చదవండి: రెండవ రోజూ దేవదేవుడి సేవలో సీఎం

ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం సంప్రదాయం. ఈ సారి స్నపన తిరుమంజన సేవల్లో పవిత్రాలు, సజ్జ కంకులతో తయారు చేయించిన కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి అలంకరణలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపించేలా టీటీడీ ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే యాలకులు, పట్టువ్రస్తాలు, సజ్జ కంకులు, పవిత్రాలు, ఎండు ద్రాక్ష–రోస్‌ పెటల్స్, వట్టివేర్లు–ముత్యాలు, నల్ల–తెల్లద్రాక్ష, కురువేరు–పసుపు, ఎరుపు పెటల్స్, మల్లె–రోజా మొగ్గలతో స్వామివారికి వేర్వేరుగా కిరీటాలు, మాలలు తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు.

బహుసుందరం రంగనాయకుల మండపం 
శ్రీవారి ఉత్సవాల్లో స్నపన తిరుమంజనానికి ప్రత్యేకత ఉంది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేస్తారు. ఇందులో భాగంగా ఉద్యానవనశాఖ సిబ్బంది రంగనాయకుల మండపాన్ని విదేశీ ఫలపుష్పాలతో బహుసుందరంగా అలంకరించారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని  ఫలపుష్పాదులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనువిందు చేశాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top