Andhra Pradesh: సాహస పర్యాటకంపై స్పెషల్‌ ఫోకస్‌

Special focus on adventure tourism - Sakshi

జల, సాహస క్రీడలకు పర్యాటక సంస్థ ప్రాధాన్యం 

వివిధ జిల్లాల్లో కొత్తగా 50 చోట్ల బోటింగ్, అడ్వెంచర్‌ కార్యకలాపాలు 

రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులతో ముందుకొచ్చిన సంస్థలు 

చిన్నారుల కోసం ఫన్‌ జోన్లు, స్కై వాక్, స్కై సైక్లింగ్, జిప్‌లైనర్, బెలూన్‌ క్రీడలు  

విశాఖ, నెల్లూరుల్లో ప్రత్యేకంగా ట్రెక్కింగ్‌ కేంద్రాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల, సాహస క్రీడల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వివిధ జిల్లాల్లో బోటింగ్‌కు అనువైన జల వనరులను, అడ్వెంచర్‌ స్పోర్ట్స్, ట్రెక్కింగ్‌కు వీలుండే ప్రాంతాలను గుర్తించింది.

ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించగా.. 50 ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలోనే ఏపీటీడీసీ ఆయా సంస్థలతో ఏపీటీడీసీ పూర్తిస్థాయి అగ్రిమెంట్లు పూర్తి చేసుకోనుంది. అనంతరం సుమారు రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులతో జల, సాహస క్రీడల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 

బోటింగ్, వాటర్‌ స్పోర్ట్స్‌ ఇలా.. 
విశాఖపట్నం డివిజన్‌లో జోడుగుళ్లపాలెం, భీమిలి, సాగర్‌ నగర్, హిరమండలం డ్యామ్, శృంగవరపు కోట, తాండవ రిజర్వాయర్, పూడిమడక, కొండకర్ల ఆవ, మంగమారి పేట, యండాడ, శారదా రివర్, గోస్తనీ నది, కాకినాడ డివిజన్‌లో భూపతిపాలెం రిజర్వాయర్, హోప్‌ ఐలాండ్, పాలవెల్లి, అంతర్వేది, కర్నూలు డివిజన్‌లో సంగమేశ్వర, సుంకేసుల, గార్గేయపురం, చిన్న చెరువు, నెల్లూరు డివిజన్‌లో గుండ్లకమ్మ, ఏపూరపాలెం–చీరాల, కొత్తపట్నం బీచ్, పాపాయపాలెం, కొత్తకోడూరు, మైపాడు, నెల్లూరు ట్యాంక్, కడప డివిజన్‌లో పీర్‌ గైబుషా కోట, కర్నూలు డివిజన్‌లో ఒంటిమిట్ట, విజయవాడ డివిజన్‌లో హంసలదీవి, సూర్యలంక, అనుపు–నాగార్జున సాగర్, మోటుపల్లి బీచ్, రివెరా బీచ్‌ రిసార్ట్‌ ఫ్రంట్, రామాపురం–వేటపాలెం, తిరుపతి డివిజన్‌లో రాయలచెరువు, కడప డివిజన్‌లో బుక్కరాయ చెరువు (బుక్కరాయపట్నం), చిత్రావతి రివర్‌ (పుట్టపర్తి) ప్రాంతాల్లో బోటింగ్, వాటర్‌ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

అడ్వెంచర్, ఫన్‌ జోన్లు ఇలా.. 
విజయవాడ డివిజన్‌లోని బెరంపార్కు, ఎత్తిపోతల జలపాతం(పల్నాడు)లో ఫన్‌జోన్, గాలి బెలూన్ల గేమ్స్, కర్నూలు డివిజన్‌లోని శ్రీశైలం, విశాఖ  డివిజన్‌ బొర్రా గుహల వద్ద వర్చువల్‌ క్రికెట్, 12డీ షోలు,  బొర్రా గుహల ప్రాంతంలో స్కై సైకిల్, స్కై వాక్, బార్మా వంతెన, గాలికొండలో జిప్‌లైన్, కాకినాడ డివిజన్‌ దిండి, ద్వారకా తిరుమల, తిరుపతి డివిజన్‌ పులిగుండు, హార్సిలీ హిల్స్‌లో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలోని జింధగడ ట్రెక్కింగ్, నెల్లూరులోని నరసింహ  కొండలో ప్రత్యేకంగా ట్రెక్కింగ్‌ సెంటర్లను ప్రవేశపెడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top