డీఎస్సీ ‘డీల్స్‌’.. తప్పించుకునే ‘డ్రిల్స్‌’ | SAP Ignores Complaints Regarding Fake Certificates in Sports Quota Recruitment | Sakshi
Sakshi News home page

డీఎస్సీ ‘డీల్స్‌’.. తప్పించుకునే ‘డ్రిల్స్‌’

Apr 27 2026 5:29 AM | Updated on Apr 27 2026 5:29 AM

SAP Ignores Complaints Regarding Fake Certificates in Sports Quota Recruitment

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అభ్యర్థిపై 2025 ఆగస్టులో శాప్‌కు చేసిన ఫిర్యాదు

స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీలో దొంగ సర్టీఫికెట్లపై ఫిర్యాదులను పట్టించుకోని శాప్‌

తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారికి ఉద్యోగాలు 

క్రీడా సంఘాలు లేకుండానే ‘మాస్టర్‌ మైండ్‌’ వ్యూహరచనలో సర్టీఫికెట్ల పరిశీలన 

అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఎలా ఎంపిక చేశారు 

అభ్యర్థుల కాండక్ట్‌ పరిశీలించకుండానే ఉద్యోగాలిచ్చేశారా? 

వాస్తవాలు బయటకొచ్చాక తీరిగ్గా విచారణ చేస్తామంటున్న శాప్‌ 

జీవో–4 సవరణపై సమాధానం దాటవేత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడా కోటా డీఎస్సీ–2025 ఎంపికల్లో పారదర్శకతకు సమాధి కట్టేశారు. పోస్టుల భర్తీ కంటే ముందే దొంగ సర్టిఫికెట్లు, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. ఇక్కడ సాక్షాత్తు సర్టీఫికెట్లు పరిశీలించి, వాటి వాస్తవికతను ధ్రువీకరించిన శాప్‌ అధికారులకే ఫిర్యాదులు అందాయి. అయితే.. సీఎం బంధువు, మాస్టర్‌మైండ్‌ తన రాజకీయ బలంతో ఫిర్యాదులను తొక్కిపెట్టేశారు. తాను ముందుగా డీల్‌ కుదుర్చుకున్న వ్యక్తులకే ఉద్యోగాలు అమ్మేయడం ద్వారా దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు దోచేశారు.

ఇంతటి దుర్మార్గపు నియామకాలను సాక్ష్యాలతో సహా ఎండగడుతూ శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘డీఎస్సీ డీల్స్‌’ కథనంతో శాప్‌ కార్యాలయం ఉలిక్కిపడింది. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అత్యంత పారదర్శకంగా పోస్టులను భర్తీ చేశామంటూ చెబుతూనే తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన ఉద్యోగులను 27న విచారించి సమగ్ర నివేదికను నియామక సంస్థ అయిన పాఠశాల విద్యా శాఖకు సమర్పించనున్నట్టు శాప్‌ పేర్కొనడం గమనార్హం.  

ఆగస్టులో ఫిర్యాదులొస్తే ఏం చేసినట్టు? 
విజయనగరానికి చెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి పోస్టల్‌ శాఖలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలడంతో పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పైగా సదరు క్రీడాకారిణి స్కూల్‌లో చేరినప్పటి డేట్‌ ఆఫ్‌ బర్త్, పాస్‌పోర్టులోని డేట్‌ ఆఫ్‌ బర్త్‌లో ఏడాదికిపైగా వ్యత్యాసం ఉంది. ఈ ఆధారాలతోనే ఆగస్టులో శాప్‌కు ఫిర్యాదు అందింది. కానీ.. దీని వెనుక చక్రం తిప్పిన ‘మాస్టర్‌ మైండ్‌’ ఆదేశాలతో ఆ ఫిర్యాదు గాలిలో కలిసిపోయింది. అప్పుడే విచారణ చేసి ఉంటే తప్పుడు నియామకం జరిగేది కాదు. కానీ, శాప్‌ ఇప్పుడు విచారణ చేసి తప్పులేదని తేల్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

పైగా ప్రభుత్వ ఉద్యోగం పొందే క్రమంలో అభ్యర్థుల ప్రవర్తన (కాండక్ట్‌)ను పరిశీలించాలి. కానీ, సదరు క్రీడాకారిణిపై స్పష్టంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదై ఉన్నా.. ఆ విషయాన్ని కావాలనే దాచిపెట్టారా? లేదా వాస్తవం తెలిసినా ఉద్యోగం ఇచ్చేశారా? అనే ప్రశ్నలొస్తున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదులు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలి. కానీ, ఆగస్టులో నమోదైన ఫిర్యాదుపై నేటికీ శాప్‌ నుంచి స్పందన లేదు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ‘విచారణ చేస్తాం.. నివేదిక ఇస్తాం’ అంటూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడుతోంది. పోనీ, ఇప్పుడు నియామకం తప్పని రుజువైతే నష్టపోయిన అర్హతగల అభ్యర్థులకు రోస్టర్‌ ప్రకారం ఆ పోస్టును భర్తీ చేస్తారా? లేదో స్పష్టత ఇవ్వలేదు. 

ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో క్రీడా సంఘాలు ఎక్కడ? 
వాస్తవానికి శాప్, క్రీడా సంఘాల సమన్వయంతోనే క్రీడలు అభివృద్ధి చెందుతాయి. కానీ, డీఎస్సీ పోస్టుల భర్తీలో క్రీడా సంఘాలను ప్రణాళిక ప్రకారం దూరం పెట్టారు. కేవలం మాస్టర్‌మైండ్‌ తనకు అనుకూల అధికారులను దగ్గర పెట్టుకుని ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగించేశారు. ఆ తర్వాత మొక్కుబడిగా క్రీడా సంఘాల నుంచి జెన్యూన్‌ సర్టీఫికెట్లు తెప్పించారు. కుల ధ్రువీకరణ, జనన ధ్రువీకరణ పత్రాల ఆమోదం మొత్తం శాప్‌లోనే నిర్ధారించేశారు. దీనికోసం బహుళ స్థాయిల్లో పరిశీలన చేసినట్టు శాప్‌ పేర్కొనడం చూస్తుంటే మాస్టర్‌ మైండ్‌ చేసింది తప్పని నిర్ధారణ అయితే అందరినీ బలిచేసే కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడంతా ‘మాస్టర్‌మైండ్‌’ సీఎం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ విచ్చలవిడిగా దోపిడీ చేయడంపై క్రీడాకారులు, క్రీడా సంఘాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.

జీవో–4 సవరణపై దాటవేత  
సీనియర్‌ నేషనల్స్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులే నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొంటారంటూ శాప్‌ వింత వాదన తెరపైకి తెచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేషనల్‌ గేమ్స్‌కు ప్రాధాన్యం కలి్పంచి పోస్టుల భర్తీ అనంతరం ఆ క్లాజ్‌ను సవరించే ప్రయత్నాల్లో భాగంగా జీవో–4 మార్పుపై సమాధానం దాటవేసింది. ఇక్కడ సీనియర్‌ నేషనల్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తారు. కానీ, నేషనల్‌ గేమ్స్‌ మాత్రం రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ, చరిత్ర చూస్తే నాలుగేళ్ల పాటు నేషనల్‌ గేమ్స్‌ను వాయిదా వేసిన దాఖలాలున్నాయి.

అంటే, ఒక ఈవెంట్‌లో పతకం సాధించిన వ్యక్తి నాలుగేళ్లు ఆ పతకంతో కొనసాగితే.. సీనియర్‌ నేషనల్స్‌లో ఏటా పతకాలు సాధిస్తున్న వ్యక్తులు మారిపోతుంటారు. అంటే, ఇక్కడ ప్రతిభ ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండదు. ఈ క్రమంలో నేషనల్‌ గేమ్స్‌కు ప్రాధాన్యాన్ని తెరపైకి తెచ్చి యువ అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేశారు. పైగా నేషనల్‌ గేమ్స్‌ ఆధారంగా జాతీయ జట్టును ఎంపిక చేయనప్పుడు ఎలా ప్రాధాన్యత ఇస్తారో శాప్‌ చెప్పకపోవడం గమనార్హం. నాన్‌ లోకల్‌ కోటాతో తమకు అన్యాయం చేశారని అభ్యర్థులు కోర్టులో వేసిన కేసులు విచారణ దశలో ఉంటే.. శాప్‌ మాత్రం గతంలో నాన్‌లోకల్‌ కోటా కింద దాఖలైన పిటిషన్లను కోర్టులు కొట్టేసినట్టు పేర్కొనడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement