ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎవరికి లాభం చేకూరుస్తోంది? అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికా? లేక అధికారంలో ఉన్న డీఎంకేకా? ద్రవిడ సెంటిమెంట్ ప్రబలంగా ఉండే తమిళనాడులో డీఎంకే పార్టీ చంద్రబాబు వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునేలా కనిపిస్తోంది. చంద్రబాబు తెలుగువారు అధికంగా నివసించే కోయంబత్తూరు తదితర ప్రాంతాలలో పర్యటించారు.
ఈ ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన తెలుగు ప్రజలే ఎక్కువ. దశాబ్దాలుగా అక్కడ జీవనం సాగిస్తున్న వారు తమిళులతో మమేకమైపోయారు. అయినాసరే... కాంగ్రెస్, డీఎంకే కూటమిపై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతోనే చంద్రబాబును ఆ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు ప్రసంగం కూడా వైరుధ్యాలతో కూడి ఉంది. పైగా తన బలహీన పాయింట్లను ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అనిపిస్తుంది.
తమిళనాడులో యాంటి హింది సెంటిమెంట్ అధికం. కానీ చంద్రబాబు అక్కడకు వెళ్లి హిందీ భాషను ప్రమోట్ చేసేలా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇది సహజంగానే అక్కడి ప్రజలకు నచ్చదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకేకి కూడా ఇది రుచించదు. చిత్రమేమిటంటే తమిళనాడులో ఎన్ని భాషలు వీలైతే అన్ని నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు ఆంధ్రలో మాత్రం ఆంగ్ల మీడియాన్ని వ్యతిరేకించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెడితే దానిని తీవ్రంగా తప్పుపట్టారు.
బాబు సన్నిహితులు దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. హిందీ నేర్చుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందా?లేక ఆంగ్లం బాగా చదివితే అధికంగా ఉపయోగం ఉంటుందా అన్నది తమిళులకు తెలియదా! మీడియా సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా డీఎంకేకి మేలు చేసినట్లయిందని కొంతమంది విశ్లేషించారు. అలాగే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన డీఎంకే అదే పార్టీతో కలవడం ఏమిటనే చిత్రమైన వాదన తీసుకువచ్చారు. ఇక్కడే ఆయన పరస్పర విరుద్దంగా మాట్లాడడమే కాకుండా, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.
ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ప్రచారం చేసేవారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆరంభించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత ఈయన కాంగ్రెస్ తో కలవకుండా ఉన్నారా అంటే అదీ లేదు. గతంలో అంటే వేరే రాష్ట్రానికి వెళ్లి ఏమి చెప్పినా, అక్కడి జనానికి తెలియదు కనుక ఎలాగో నడిచిపోయేది. ఈ రోజుల్లో అలా కాదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా, అందులో తేడా ఉంటే క్షణాలలో సోషల్ మీడియాలో వీడియోలతో సహా వచ్చేస్తోంది. చంద్రబాబు కూడా అలాగే దొరికిపోయారనుకోవాలి.
1983 ఎన్నికలలో కూడా చంద్రబాబు తన మామ ఎన్.టి.ఆర్.ను కాదని కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీలోకి ప్రవేశించి, ఆధిపత్యం సాధించుకున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. బీజేపీతో కొన్నిసార్లు, ఇతర పార్టీలతో కొన్నిసార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు.
ఆ క్రమంలో 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వదలి వేసినా, 2023 శాసనసభ ఎన్నికలలో పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు సహకరించారన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వద్ద టిడిపి జెండాలు కూడా అప్పట్లో రెపరెపలాడాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల అనుబంధం తెలిసిందే. కాకపోతే ఈ విషయాలేవీ తమిళులకు తెలియవన్నది ఆయన నమ్మకం కావచ్చు.
ఇది ఒక కోణం అయితే కాంగ్రెస్‌తో స్నేహం చేస్తున్న రోజుల్లో సోనీయాగాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి సభలలో పాల్గొన్నారు.బిజెపి నేతలను ముఖ్యంగా ప్రధాని మోడీని తీవ్రమైన పరుష భాషలో విమర్శించేవారు.ఆ క్రమంలో అప్పట్లో తమిళనాడు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీ కన్నా స్టాలిన్ సమర్థమైన నేత అని చంద్రబాబు ప్రశంసించారు. మామూలుగా అయితే ఈ అంశం పెద్దగా ప్రస్తావనకు వచ్చేది కాదేమో. కాని స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో ఈ వీడియోలన్ని బయటకు వచ్చాయి. చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలను తమిళనాడులో మరో సారి బహిర్గతం చేసుకున్నారు. ఇది డీఎంకే కే మేలు చేసే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు ప్రస్తావించి ఎన్డీయే కూటమిని డిఫెన్స్ లో పడేసినట్లు అనిపిస్తుంది.
నిజానికి చంద్రబాబు ఈ టూర్లో కాంగ్రెస్‌పై మరీ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేయలేదు. సాధారణంగా ఆయన తన ప్రత్యర్ధులపై వ్యక్తిత్వ హననానికి పాల్పతుంటారు. అందులో మంచి, చెడు కూడా చూడరు. అలాంటిది ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేదా డీఎంకే ముఖ్యనేతలెవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం వివిధ రంగాలలో వైఫల్యం చెందిందని, చెన్నై వెనుకబడిపోయిందని, అప్పులపాలైందని, మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని.. ఇలాంటి విమర్శలేవో చేశారు. అవన్ని విన్నవారు ఇదేదో ఏపీలో తన ప్రభుత్వం గురించి తానే చెప్పుకుంటున్నట్లుగా ఉందని చమత్కరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన రాష్ట్రం. చెన్నై ఉపాధి కేంద్రంగా ఉంది.
ఏపీ నుంచి అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అదే టైమ్ లో ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారింది. ఈ రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ రూ.355000 కోట్లకు పైగా అప్పు చేసి దేశంలో రికార్డు సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో అనేకం అమలు కాలేదు.వి శాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చేసినట్లు, ఇతరత్రా ఏదో అభివృద్ది జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయాలేవి తమిళ ప్రజలకు పెద్దగా అవసరం లేనివే. లేని గొప్పలు చెప్పుకుని ఏపీలో ఎల్లో మీడియాకు బానర్ కధనాలు ఇవ్వడమే లక్ష్యం కావచ్చు.
ఏపీలో మద్యం బెల్ట్ షాపులు ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. మద్యాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.నకిలీ మద్యం ప్లాంట్ కూడా నడిచిన వైనం బయటపడిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజన్ సర్కార్ తో బుల్లెట్ వేగంతో అభివృద్ది అంటూ ప్రచారం చేశారు.కాని కేంద్రం ద్వారా ఏపీకి ఈ రెండేళ్లలో కలిగిన లాభం ఏమిటో ఆయన వివరించలేకపోయారు. అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు కడుతున్నామని చెప్పుకున్నారు. దాని అవసరంపై టీడీపీ మేధావులే పెదవి విరుస్తున్నారు.
అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలను భయపెడుతున్న విషయం తమిళులకు తెలియకపోవచ్చు. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేరే విషయం. చివరిగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యంగ్య వ్యాఖ్యను ప్రస్తావించుకోవాలి.స్టాలిన్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కామెంట్ చేశారట.'చంద్రబాబు 1995లో నన్ను మంచోడు అన్నారు. 2004లో కాదన్నారు. 2009లో మంచోడు అన్నారు. 2014లో కాదు అన్నారు. 2019లో మళ్లీ నన్ను మంచోడు అని మెచ్చుకున్నారు.ఇప్పుడు 2026లో తిరిగి నేను మంచోడిని కాదు అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు తమిళనాడు ప్రజలు పట్టించుకోరు" అని అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి ఉంటుందా?

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


