ఆర్యవైశ్యుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం
సాక్షి, అమరావతి: ఆర్యవైశ్యుల పాలిట ద్రోహిగా సీఎం చంద్రబాబు మిగిలిపోయారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో వెలంపల్లి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, చంద్రబాబు పాలనలో తమ సామాజికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వ్యాపారులకు వైఎస్ జగన్ ఊతమిచ్చారని చెప్పారు.
ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య వంటి పథకాల ద్వారా అగ్రవర్ణ పేదలకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని వివరించారు. తద్వారా వ్యాపారాలు బాగా జరిగాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నీ నిలిచిపోయాయని, మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు కాకపోవడంతో పాటు తల్లికి వందనం వంటి పథకాలూ నిర్వీర్యమయ్యాయన్నారు. దీంతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ పరిధిలోని ఆర్యౖవెశ్య సత్రాలు, ట్రస్టులను వారే నిర్వహించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. విజయవాడలో ఆర్యవైశ్య భవనం నిర్మాణం, కర్నూలులో పేద ఆర్యవైశ్య విద్యార్థుల హాస్టల్ భవనం కోసం నిధులు మంజూరు, పెనుగొండలో వాసవీ మాత ఆలయాభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించడం వంటి అనేక చర్యల ద్వారా ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ చేసినంతగా మరే నాయకుడు చేయలేదని వివరించారు.
వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు మాట్లాడితే.. ఆయన్ను చంద్రబాబు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ని చేశారు. ఆర్యవైశ్యులకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని చెప్పారు.వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యులకు వైఎస్సార్‌సీపీ జెండా అండగా నిలిచింది.
చంద్రబాబు కూటమి ప్రభుత్వంఅన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత కృషి చేస్తుంది’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఆర్యవైశ్య విభాగం నాయకులు గుబ్బా చంద్రశేఖర్, రేబాల శ్రీను, మిట్టా కరుణాకర్, మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


