చుట్టేసెయ్‌ చుట్టేసెయ్‌.. భూమి.. | Sakshi
Sakshi News home page

చుట్టేసెయ్‌ చుట్టేసెయ్‌.. భూమి..

Published Tue, Jan 5 2021 9:29 AM

East Godavari Man Travelling Around Country With Bike - Sakshi

సాక్షి, రాజానగరం: ప్రఖ్యాత రచయిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచన ‘లోక సంచారి’ అతడికి స్ఫూర్తి. మాతృదేశాన్ని చుట్టి రావాలన్నది అతడి సంకల్పం. తన 25వ ఏట ప్రారంభమైన అతడి సంచారం ఎనిమిదేళ్లుగా 17 వేల కిలోమీటర్లు కొనసాగింది. ఇంకా సాగుతూనే ఉంది. తన ద్విచక్ర వాహనాలైన బుల్లెట్, లేదా బైక్‌పై పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు తదితర ప్రఖ్యాత స్థలాలను అతడు చుట్టి వచ్చాడు. తాజాగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర రాజధాని హంపీ నగరాన్ని సందర్శించి వచ్చాడు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన జీవితాశయమని చెప్తాడు రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన 33 ఏళ్ల పెన్నాడ మోహన్‌.

బీఎస్సీ చదివిన అతడు ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. భార్య, ఇద్దరు కుమారులున్న మోహన్‌.. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్‌’ అన్న మహాకవి మాటలను ఉన్నంతలో ఆచరించేందుకు ‘లియో ఫౌండేషన్‌’ ప్రారంభించాడు. దివాన్‌చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని ఒక సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న ఆయన ఎనిమిదేళ్లుగా ఏటా దేశంలోని ఏదో ఒక ముఖ్య ప్రదేశానికి వెళ్లి వస్తుంటాడు. తన యాత్రలను ద్విచక్ర వాహనాలపైనే సాగిస్తూ రాత్రి వేళ గుడారం వేసుకుని తలదాచుకుంటాడు. కొన్నిచోట్ల స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించేదని చెప్తాడు.

ఈ యాత్రానుభవాలతో పుస్తకం తీసుకువస్తా..
తాను చూసిన ప్రకృతి అందాలను, సంస్కృతులను భావితరాలకు తెలియజేసేందుకు మోహన్‌ కొన్ని పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాడు. వాటిలో ‘నేను చూసిన డొక్కా సీతమ్మ’, ‘ఆ రాత్రి నేను కాదేమో’, ‘తలుపులు లేని ఊరు స్యాలియా’ వంటివి బాగా పాఠకాదరణ పొందాయి. ఎనిమిదేళ్లు సాగిన యాత్రపై ‘ప్రయాణంలో నా జీవితం’ అనే పుస్తకాన్ని కూడా తీసుకువస్తానంటున్నాడు. ఇంతవరకూ తన యాత్రలకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని, అదే స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహిస్తానంటున్నాడు మోహన్‌.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement