
చెన్నైలో బయలుదేరి 2వ తేదీన విశాఖ చేరుకోనున్న నౌక
మళ్లీ సముద్రంలో సందడే సందడి
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రారంభమైన కార్డేలియా క్రూయిజ్ యాత్ర
విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో ప్రారంభం
చెన్నై–విశాఖపట్నం–పుదుచ్చేరి–చెన్నై మధ్య సర్విసు
ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రారంభమైన టికెట్ల విక్రయాలు
విశాఖ సిటీ : సాగర విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. సముద్ర జలాల్లో తేలియాడే అద్భుత సౌధం మళ్లీ నగరానికి వచ్చేస్తోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చెన్నై–విశాఖపట్నం–పుదుచ్చేరి–చెన్నైల మధ్య నడపడానికి కార్డేలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.
2022 జూన్‌లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు. దీంతో 85 శాతం మేర ఆక్యుపెన్సీతో ఆ ఏడాది సెపె్టంబర్ వరకు నడిచింది. ఈసారి విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెరి్మనల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలను సైతం ప్రారంభించింది.
విహార యాత్ర ఆరంభం ఇలా..
సెవెన్ స్టార్ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్‌నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాలాటలు.. రాక్ క్లైంబింగ్ విన్యాసాలు.. ఆహ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమవుతోంది.
జూన్ 30న చెన్నైలో బయల్దేరిన ఈ క్రూయిజ్ నౌక జూలై 2వ తేదీ ఉదయం విశాఖకు వస్తుంది. అదే రోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చెన్నై వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7న చెన్నైలో మరో ట్రిప్పు ప్రారంభమై.. 9వ తేదీన విశాఖకు చేరుకుని.. మళ్లీ ఇక్కడి నుంచి బయలుదేరి 12వ తేదీన చెన్నైలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చెన్నైలో మొదలై 16వ తేదీకి విశాఖకు చేరుకుంది. తిరిగి అదే రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై 19వ తేదీన చెన్నైలో ముగుస్తుంది.
క్రూయిజ్‌లో సదుపాయాలు
⇒ కార్డేలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది.
⇒ మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్‌లో ఇంజిన్, రెండో ఫ్లోర్‌లో కార్గో ఉంటుంది.
⇒ మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది.
⇒ అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు.
⇒ పదో ఫ్లోర్‌లో డెక్ లాంటి పెద్ద టెరస్ర్ ఉంటుంది.
⇒ 11వ అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది.
⇒ లగ్జరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి.
⇒ ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి.
⇒ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.
⇒ జిమ్, ఫిట్‌నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
⇒ డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ బ్యాండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
⇒ అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి.
⇒ టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం.
⇒ లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వ చొరవతో విశాఖకు క్రూయిజ్
విశాఖలో క్రూయిజ్ రాక దీర్ఘకాల కలగా ఉండేది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. విలాసవంతమైన క్రూయిజ్ నౌక ప్రయాణం విశాఖలో అందుబాటులో ఉంటే.. ఇక్కడకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని భావించింది. ఇందుకోసం కార్డేలియా సంస్థతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి కార్డేలియా క్రూయిజ్ సర్విసు విశాఖకు లేదు. ముంబయి, చెన్నై, గోవా, అండమాన్, లక్షద్విప్ వంటి ప్రాంతాల్లో ఉండేది.
రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విశాఖ నుంచి సర్విసు నడిపేందుకు అంగీకరించింది. అది కూడా ముందుగా మూడు సర్విసులు నడిపి డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ విశాఖవాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్ విహార యాత్రకు పోటీ పడ్డారు. దీంతో ఆ సర్విసును సెపె్టంబర్ వరకు పొడిగించింది.
క్యాసినో ఆడాలంటే..
రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది.