వైఎస్ జగన్ హయాంలో పూర్తి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ప్లాట్‌ఫారం వద్దనున్న పడవలు
ప్రైవేట్‌పరం చేసేందుకు బాబు సర్కారు ప్రత్యేక మార్గదర్శకాలు
రూ.26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు వైఎస్ జగన్ శ్రీకారం.. వైఎస్సార్‌సీపీ హయాంలో పరుగులు పెట్టిన తీరప్రాంత అభివృద్ధి
చంద్రబాబు అధికారంలోకి రాగానే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 30 ఎకరాలు
సాగర్ డిఫెన్స్‌కు కేటాయింపు.. మచిలీపట్నం హార్బరు వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్‌కు సైతం టెండర్లు
చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక పోర్టుల పనులకు లంగరు..
మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణం గాలికి..
ఆగస్టులోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
వాటిని ఇంతవరకు అందుబాటులోకి తేకపోగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న వైనం
రెండేళ్లవుతున్నా రెండో దశ ఫిషింగ్ హార్బర్ల పనులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని సగానికి కుదించి మత్స్యకారుల నోటిలో మట్టి
2024లోనే 90% పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టు
వైఎస్ జగన్ సీఎంగా కొనసాగి ఉంటే తీరప్రాంతం పారిశ్రామికంగా కళకళలాడేదంటున్న స్థానికులు
జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి
తెచ్చి ఉంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి.. రాష్ట్ర జీఎస్‌డీపీ అదనంగా రూ.9,000 కోట్లు పెరిగి ఉండేదంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: కొత్తగా సంపద సృష్టిస్తానని నమ్మబలికి ఉన్న సంపదనే బినామీల చేతుల్లో పెట్టేస్తున్నారు..!అభివృద్ధికి తానే కేరాఫ్ అంటూ జబ్బలు చరుచుకుంటూ.. జరిగిన అభివృద్ధిని నాశనం చేసేస్తారు! ప్రజోపయోగ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేసి ప్రజాధనాన్ని వాటాలతో పంపకాలు చేస్తుంటారు!వారం వారం రూ.వేల కోట్ల అప్పులు చేస్తూ.. పైసాకి కూడా లెక్కలు చెప్పరు..! టోటల్‌గా చంద్రబాబు పాలన అంటే రాష్ట్ర సంపదను కరగబెట్టి తన బినావీులకు ధారపోయడం!
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ ముందుచూపు, విజన్‌తో శ్రీకారం చుట్టిన 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను తన సన్నిహితులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు అధికారంలోకి రాగానే పనులను కుట్రపూరితంగా నిలిపివేయడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో 1,053 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.26,501 కోట్లతో చేపట్టిన పోర్టులు, షిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొక్కిపెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన వాటిని కూడా అందుబాటులోకి తేకుండా మోకాలడ్డారు.
ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నెను అందుబాటులోకి తేకుండా...
రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట వద్ద 4 కొత్త పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించి ఎక్కడా మధ్యలో పనులు ఆగకుండా పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చి ప్రారంభించింది. 2024 ఎన్నికల నాటికే రామాయపట్నం పోర్టు 90 శాతానికిపైగా పూర్తయింది. బల్క్ కార్గో బెర్త్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. దీనిని 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయినాసరే.. దాదాపుగా పూర్తయిన రామాయపట్నం పోర్టుతోపాటు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వలదిన్నె హార్బర్‌ను అందుబాటులోకి తేకుండా చంద్రబాబు నిలిపివేశారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది.
కూటమి సర్కారుపై మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు..
తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో రాష్ట్ర తీరంలోకి అక్రమంగా చొరబడి మత్స్య సంపదను అపహరిస్తున్నట్లు స్వయంగా నెల్లూరు కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు ఎదురొడ్డి తమిళనాడు బోట్లను పట్టుకొని బంధిస్తే కూటమి సర్కారు దొడ్డిదారిన వదిలేయడంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. డబ్బులు తీసుకుని బోట్లను వదిలేసిన గ్రామాలను గుర్తించి జరిమానా విధించడమే కాకుండా అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావుతో మత్స్యకారులు ఎవరూ మాట్లాడకూడదంటూ మత్స్యకార సంఘాలు అంతర్గతంగా ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దీంతో ముఖ్యమంత్రి హడావుడిగా సమీక్ష నిర్వహించి రెండో విడత హార్బర్ల నిర్మాణం చేపట్టాలంటూ బుజ్జగించే యత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తెచ్చి ఉంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,000 కోట్లు పెరిగి ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రైవేటీకరణ దిశగా బాబు అడుగులు
పీపీపీ విధానంలోకి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు
తూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో టీడీపీ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తే.. చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. మిగిలిన పోర్టులు, హార్బర్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టనుంది. ఈ కుట్రలో భాగంగానే తీరప్రాంతం అభివృద్ధి ముసుగులో ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్‌మెంట్ గైడ్‌లైన్స్ 2026 తాజాగా విడుదల చేసింది. దీనిద్వారా తీర ప్రాంతంలోని వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను టీడీపీ పెద్దలు తమకు నచ్చినవారికి కేటాయించనున్నారు. 
తీర ప్రాంతంలో ‘ఏ’ కేటగిరీ భూములను ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా, బీ కేటగిరీ కింద భారీ స్థాయిలో భూ కేటాయింపులను ప్రభుత్వ ఆమోదంతో చేపట్టనున్నారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 30 సంవత్సరాల వరకు లీజు విధానంలో ఈ భూములను కట్టబెట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్‌లో అభివృద్ధి చేసిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలోకి మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణ పనులను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బందరు పోర్టు నిర్మాణ కాంట్రాక్టుల విలువ భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. గతేడాది మార్చిలో రూ.402.62 కోట్ల పనులను కేటాయించగా తాజాగా మరో రూ.395.38 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ బందరుపోర్టు కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం నజరానా అందించింది. వాస్తవానికి గతేడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావాల్సిన పోర్టు పనులను నిలిపివేసి చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది.
మత్స్యకారులకు దగా..
ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలు
చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.3,520.64 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలిదశలో సుమారు రూ.2,113.06 కోట్లతో ఐదు హార్బర్లు నిర్మించాలని ప్రతిపాదించగా కూటమి సర్కారు వాటిని నాలుగుకు కుదించడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని రూ.632 కోట్లకు తగ్గించేసింది. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవుల్లో మాత్రమే హార్బర్లు నిర్మిస్తోంది. 

బియ్యపుతిప్పను ఫిషింగ్ హార్బరు నుంచి ఫిష్‌ల్యాండ్ సెంటర్‌గా మార్చేసింది. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మార్చేసే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయంలో కోత పెట్టడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ పనుల నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడంపై మండిపడుతున్నారు. అంతేకాదు.. ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు మత్స్యకారుల పొట్ట కొడుతోంది. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరులో 29.58 ఎకరాలను పుణెకు చెందిన సాగర్ డిఫెన్స్‌కు అప్పగించగా.. మచిలీపట్నం హార్బర్ వద్ద కూడా నౌకా తయారీ కేంద్ర నిర్మాణం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.
జగన్‌పై నమ్మకంతోనే భూములిచ్చాం..
వైఎస్ జగన్‌పై ఉన్న నమ్మకంతోనే మా భూములను, గ్రామాన్ని మూలపేట పోర్టుకు త్యాగం చేశాం. పోర్టు పనులు కూడా వేగంగా జరిగాయి. ఈ ప్రాంత అభివృద్ధికి జగన్ చేసిన కృషిని భావితరాలు కూడా గుర్తుంచుకుంటాయి.
– జీరు శివ, నిర్వాసితుడు, మూలపేట, సంతబొమ్మాళి మండలం
ప్రాణాలైనా అర్పిస్తాం..
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మా మత్స్యకారుల భవిష్యత్తు. వైఎస్ జగన్ మా బతుకులు మార్చాలని గట్టి సంకల్పంతో నిర్మించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ మా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ కట్టించిన ఫిషింగ్ హార్బర్ భూముల్లో కొంత భాగం ప్రైవేట్‌కు అప్పగించారంటే.. మిగతాది కూడా వారికి కట్టబెట్టే ఉద్దేశం ఉన్నట్లే. ప్రాణాలైనా అర్పించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కాపాడుకుంటాం.
– మామిడి గోవిందస్వామి, మాజీ సర్పంచ్, జువ్వలదిన్నె, బోగోలు మండలం
జగన్ వరమిస్తే.. చంద్రబాబు ద్రోహం
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించి వైఎస్ జగన్ వరమిస్తే.. చంద్రబాబు వచ్చి ద్రోహం తలపెట్టారు. మా ప్రాంతాన్ని ప్రైవేట్‌కు అప్పగించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది? మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి పేరొస్తోందనే దుగ్ధతోనే మా బతుకులు, భవిష్యత్‌ను అంధకారం చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. మత్స్యకారులంతా ఏకమై మా అభిప్రాయాలను వైఎస్ జగన్‌కు తెలియజేయాలని తీర్మానించుకున్నాం.
– ప్రళయ కావేరి రాంబాబు, తుమ్మలపెంట, కావలి మండలం
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు..
బందరు పోర్టుతో ఈ ప్రాంతవాసుల కల సాకారమైంది. ఎన్నో సంవత్సరాలుగా పోర్టు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. పోర్టు ఆధారిత పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి.
– మద్దుల గిరీష్, కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, మచిలీపట్నం, కృష్ణాజిల్లా
గత ప్రభుత్వం సఫలీకృతం..
పోర్టు నిర్మాణంతో బందరుకు మహర్దశ రానుంది. 20 సంవత్సరాలుగా పోర్టు నిర్మాణం కోసం పోరాటం చేశాం. పోర్టు తీసుకురావటంలో గత ప్రభుత్వం సఫలీకృతమైంది. శరవేగంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
– డాక్టర్ బి.శ్రీనివాసాచార్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్, ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
హార్బర్‌తో మత్స్యకారులకు మేలు
మచిలీపట్నం హార్బర్ నిర్మాణంతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. మత్స్యసంపదకు మంచి ధర లభించేలా ఎగుమతిదారులను ప్రోత్సహించాలి. సముద్ర ముఖ ద్వారాన్ని మెరుగుపరచాలి.
– సైకం ఆంజనేయులు, డీప్ సీ ఫైబర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు


