మైనర్‌ బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల‌పై ఏపీ హైకోర్టు ఆగ్ర‌హం | AP HighCourt Fires On Police Protecting TDP Leader In Bhivamavaram Case | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల‌పై ఏపీ హైకోర్టు ఆగ్ర‌హం

Apr 24 2026 10:25 PM | Updated on Apr 24 2026 10:54 PM

AP HighCourt Fires On Police Protecting TDP Leader In Bhivamavaram Case

సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తెలుగుదేశం పార్టీ నేతను కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకు సిగ్గు అనిపించట్లేదా? బాలిక ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? ఫిర్యాదారుడు స్పష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టి దర్యాప్తు కొనసాగించాలి. 

బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిందన్న‌ దానికి సంబంధించి 164 స్టేట్మెంట్ వాంగ్మూలాలు ఇతర ఆధారాలు ఉన్నాయని చెబితే దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? బాధితురాలకు అండగా ఉండాల్సింది పోయి కేసు ఉపసంహరించుకోమని బెదిరిస్తారా? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి. 

మీరు దర్యాప్తు సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వహించట్లేదు కాబట్టే న్యాయం కోసం బాధితురాలు కోర్టుకు రావాల్సి వచ్చింది. మీ బాధ్యత మీకు కొంతైనా తెలియాలంటే ఒకసారి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు చదవండి’ అంటూ హైకోర్టు  పోలీసుల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు వివరణ సంతృప్తిగా లేదని హైకోర్టు పేర్కొంది. 

ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే ఒకటో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement