వేగంగా నే‘రడి’

AP Govt working hard to start Neradi barrage construction - Sakshi

బ్యారేజీ పూర్తయితే వంశధార ఆయకట్టు రెండో పంటకూ నీళ్లు

ముంపునకు గురయ్యే 106 ఎకరాలపై ఒడిశా సహాయ నిరాకరణ

ఇదే అంశాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

పరిహారాన్ని డిపాజిట్‌ చేసి పనులు చేపట్టాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీల నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేరడి బ్యారేజీని నిర్మించి రోజుకు 8 వేల క్యూసెక్కులను మళ్లించడం ద్వారా వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 కింద 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. వంశధార జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో నేరడి బ్యారేజీ పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణం ద్వారా ఒడిశాలో ముంపునకు గురయ్యే 106 ఎకరాలను గుర్తించేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) నేతృత్వంలో సంయుక్త సర్వేకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్న అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి ఇప్పటికే తెచ్చింది. 106 ఎకరాల భూసేకరణకు అయ్యే వ్యయాన్ని ఒడిశా సర్కార్‌ వద్ద డిపాజిట్‌ చేసి నేరడి బ్యారేజీ పనులను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రెండో పంటకూ సాగునీరు..
► ఒడిశా సర్కార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయిం చడంతో అభ్యంతరాలను పరి శీలించాలని వంశధార ట్రిబ్యునల్‌ను న్యాయ 
స్థానం ఆదేశించింది. 
► నేరడి బ్యారేజీతో ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు వంశధార ట్రిబ్యునల్‌ సీడబ్ల్యూసీ ఎస్‌ఈ నేతృత్వంలో సంయుక్త సర్వేకు ఆదేశిం చినా ఒడిశా సహాయ నిరాకరణతో ముందుకు సాగడం లేదు. ఇదే అం శాన్ని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం వంశ ధార ట్రిబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయాలని కోరింది. నేరడి బ్యారేజీ పూర్తయితే వంశధార ఆయకట్టుకు రెండో పంటకూ నీళ్లందించవచ్చునని సాగు నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

కాట్రగడ్డ సైడ్‌ వియర్‌తో 8 టీఎంసీలే మళ్లింపు..
► నాలుగున్నర దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులను దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధారపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 33.704 కి.మీ. పొడవైన హైలెవల్‌ కెనాల్‌ ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించి సింగిడి, పారాపురం, హీర మండలం రిజర్వాయర్ల ద్వారా నీళ్లందించాలని నిర్ణయించారు.
► నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా ఫలాలను అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేసి భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్‌ వియర్‌(మత్తడి) నిర్మించి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. సైడ్‌ వియర్‌ నిర్మాణం వల్ల గరిష్టంగా ఎనిమిది టీఎంసీలను మళ్లించవచ్చు.
► నేరడి బ్యారేజీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ వంశధార ట్రిబ్యునల్‌ 2017 సెప్టెంబరు 13న తుది తీర్పు ఇచ్చింది. బ్యారేజీ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు, ఎడమ కాలువ ద్వారా ఒడిశాకు నీటిని సరఫరా చేయాలని, వ్యయాన్ని దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని నిర్దేశించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top