ఏటేటా సంక్షేమ వ్యయం పెరుగుదల 

Annual increase in welfare expenditure of Andhra Pradesh Govt - Sakshi

2019–20లో సామాజిక రంగం వ్యయం రూ.78,797 కోట్లు 

అదే 2021–22లో రూ.1.13 లక్షల కోట్లు 

బాబు హయాం కన్నా ఆస్తుల కల్పన వ్యయం పెంపు 

కోవిడ్‌తో రాష్ట్ర పన్ను ఆదాయంపై రెండేళ్లపాటు తీవ్ర ప్రభావం 

సామాజిక రంగం, కేపిటల్‌ వ్యయం, పన్ను ఆదాయంపై ఆర్‌బీఐ నివేదిక 

సాక్షి, అమరావతి:  విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక స్పష్టంచేసింది. సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. రాష్ట్రాల వారీగా సామాజిక రంగం, ఆస్తుల కల్పన వ్యయంతో పాటు రాష్ట్రాల సొంత పన్ను ఆదాయాల వివరాలను ఆర్‌బీఐ విడుదల చేసింది.

విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను చేపడుతున్నందున ఆ రంగాల్లో వ్యయం ఎక్కువగా ఉంది. మరోపక్క.. నవరత్నాల పేరుతో అర్హులైన వారందరికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నందున సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా ఏటా పెరుగుతోందని నివేదిక వివరించింది.

మరోపక్క.. ఆస్తుల కల్పన వ్యయం కూడా బాబు హయాంలో కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక స్పష్టంచేసింది. 2018–19లో ఆస్తుల కల్పన వ్యయం రూ.35 వేల కోట్లుండగా 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ.36,224 కోట్లు చేసిందని.. అదే 2021–22లో ఆస్తుల కల్పన వ్యయం రూ.47,583  కోట్లకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. కానీ, ఆర్థిక మందగమనంతో పాటు కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల రాష్ట్ర సొంత పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది.

2021–22లో మాత్రం సొంత పన్ను ఆదాయం పుంజుకుందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక 2018–19లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.58,677 కోట్లు రాగా 2019–20లో రూ.57,601 కోట్లే వచ్చింది. 2020–21లో మరింత తగ్గి రూ.57,359 కోట్లకు పరిమితమైంది. అదే 2021–22లో మాత్రం రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.85.265 కోట్లుగా ఆర్‌బీఐ పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top