అక్రమ మైనింగ్‌దారులను విడిచిపెట్టం 

Andhra Pradesh High Court On Illegal mining - Sakshi

మా ఉత్తర్వుల తర్వాత కూడా తవ్వకాలు జరిగాయో, లేదో తేలుస్తాం 

దీనిపై సుమోటో కోర్టు ధిక్కార కేసు నమోదు చేయండి  

రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: అక్రమ మైనింగ్‌దారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి పరిధిలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను నిలిపేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేశాక కూడా తవ్వకాలు జరిగాయా, లేదా అనే వ్యవహారాన్ని తేలుస్తామంది. దీనిపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నెల 17న దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది.

ఈ కేసులో పిటిషనర్ల తరఫు వాదనలు వినిపిస్తున్నందుకు తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని న్యాయవాది మహేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు  స్పందించింది. బెదిరింపుల విషయాన్ని లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన వారిపై ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంపై మండిపడ్డ హైకోర్టు తమ ముందు హాజరైన ఎస్‌ఐ చంటిబాబును వివరణ కోరింది.

ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని, లేనిపక్షంలో ఇబ్బందులు పడతారని హెచ్చరించింది. మైనింగ్‌ ఆపాలంటూ తాము ఆదేశాలు ఇచ్చిన రోజునే ఫిర్యాదుదారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే అరెస్టుకు ఆదేశాలిస్తామని ఎస్‌ఐను హెచ్చరించింది.

ఒంటిపై ఉన్న యూనిఫాంను ఎలా తీయించాలో తమకు బాగా తెలుసంది. గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతినిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్‌ జడ్జికి సూచిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది.  

ఇదీ కేసు.. 
తోటపల్లి పరిధిలో గ్రావెల్‌ తవ్వకాలు జరుపుకునేందుకు బసవపూర్ణయ్యకు తాత్కాలిక అనుమతి మంజూరు చేస్తూ గనుల శాఖ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ జె.లక్ష్మణరావు, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మొదట విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు తవ్వకాలు జరపొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. మరో సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతినిచ్చారు.

ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతినిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన రైతులపైనే ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకున్న ధర్మాసనం మైనింగ్‌ నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top