విదేశాల నుంచి వీరాపురానికి..
సాక్షి, పుట్టపర్తి: ఏటా ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాలం మొదలవుతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ అక్కడి పక్షులు జనవరి చివరి వారంలో వీరాపురానికి వస్తాయి. ఇక్కడే సంతానోత్పత్తి పూర్తి చేసుకుని ఆగస్టు తరువాత తిరిగి పిల్లలతో సహా వెళ్లిపోతాయి. వీరాపురంలో 188 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పురాతన చెరువు వీటికి ఆవాసంగా మారింది. ఈ చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. చుట్టూ వందలాది చెట్లు ఉండటంతో ఎన్నో ఏళ్లుగా సైబీరియా నుంచి వేల సంఖ్యలో కొంగ జాతి పక్షులు వలస వస్తున్నాయి. వీటిని స్థానికులు ప్రేమగా ఎర్రమూతి కొంగలంటారు. కాలానికి అనుగుణంగా చెరువులోని చేపలతో పాటు ఆహారం కోసం చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. కొన్నేళ్లుగా గ్రామంతో ఇవి మమేకమయ్యాయి. సీజన్‌లో పక్షులను చూసేందుకు వచ్చే పర్యాటకులతో వీరాపురం కిటకిటలాడుతుంది.
పెయింటెడ్ స్టార్క్‌ల జీవన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నీళ్లు గొంతు వరకు నింపుకుని పిల్ల పక్షులకు అందించేందుకు మళ్లీ మొత్తం నీటిని బయటకు తీసి ఇవ్వడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆహారం కోసం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువులు, పంట పొలాల వైపు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి.
గ్రామంలోని ఇళ్ల మధ్య చెట్లపైనే సుమారు రెండు వేలకు పైగా సైబీరియరిన్ కొంగలు కనిపిస్తుంటాయి. 24 గంటలూ వాటి అరుపులతో ఎవరికై నా చిరాకు పుట్టడం సహజం. అయితే వీరాపురం గ్రామస్తులు మాత్రం వాటి అరుపులను ఆస్వాదిస్తూ బంధువుల్లా ఆదరిస్తారు. అంతేకాకుండా చెరువును వారసత్వ సంపదగా ప్రకటించారు. ఈ చెరువు నీటితో పంటు సాగుచేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరించి పక్షులు రాకుండా పోతాయనే భయంతో గ్రామానికి చెందిన రైతులు ఆయకట్టు పరిధిలో పంటల సాగుకు శాశ్వతంగా విరామం ప్రకటించారు. బోరు బావులు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
సైబీరియన్ కొంగల రాకతో గ్రామానికి మేలు జరుగుతుందని వీరాపురం వాసుల నమ్మకం. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు.
గ్రామంలోని చెట్ల మీద సేద
తీరుతున్న పక్షులు
వీరాపురం.. చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున ఉన్న ఓ మారుమూల గ్రామం. విదేశీ జాతికి చెందిన పక్షులు ఏటా సంతానోత్పత్తి కోసం ఈ గ్రామానికి వస్తుండడంతో వీరాపురం పేరు గూగుల్‌లోకి ఎక్కింది. మూడు శతాబ్దాలుగా విదేశీ పక్షులతో ఆ గ్రామానికి అనుబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సైబీరియా, రష్యా దేశాల నుంచి ఖండాంతరాలు దాటి శీతాకాలంలో పక్షులు వలస వస్తుండడం విశేషం.
చూడముచ్చటైన పక్షులు..
అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్ స్టార్క్‌లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతం. రష్యాలోని సైబీరియా లోయ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 150 రకాల జాతుల పక్షులు ఉన్నాయి. సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో అక్కడి పక్షులు వలస బాట పడుతుంటాయి. శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు వలస వెళుతుంటాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్నెళ్ల పాటు సేదతీరుతూ సంతానోత్పత్తి చేసుకుని తిరిగి సైబీరియాకు పయనం అవుతాయి. పెయింటెడ్ స్టార్క్ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. వీటి శాసీ్త్రయ నామం ‘మిక్టీరియాలూకోసిఫల’. 3 నుంచి 3.5 అడుగుల ఎత్తు ఉంటాయి. ఎగరడానికి రెక్కలు విప్పితే ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. సుమారు 3.5 నుంచి 4 కిలోల వరకు బరువు ఉంటుంది.
ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో సైబీరియా నుంచి వస్తున్న పక్షులు
ఆరు నెలల తర్వాత స్వదేశానికి
తిరుగు పయనం
మూడు శతాబ్దాలుగా గ్రామంతో
పక్షులకు విడదీయరాని అనుబంధం
మేలు
జరుగుతుందనే నమ్మకం..
బంధువుల్లా ఆదరిస్తూ..
జీవనశైలి ప్రత్యేకం..
వీరాపురం చేరుకోండి ఇలా..
చిలమత్తూరు నుంచి 11 కిలోమీటర్ల దూరం, హిందూపురం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వీరాపురం ఉంది. రైలులో అయితే హిందూపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆ గ్రామానికి వెళ్లవచ్చు. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా కొడికొండ చెక్ పోస్టు చేరుకుని.. అక్కడి నుంచి చిలమత్తూరు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు.
విదేశాల నుంచి వీరాపురానికి..


