‘ఆటోమేషన్‌’తో బహుళ ప్రయోజనాలు | - | Sakshi
Sakshi News home page

‘ఆటోమేషన్‌’తో బహుళ ప్రయోజనాలు

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

‘ఆటోమేషన్‌’తో బహుళ ప్రయోజనాలు

‘ఆటోమేషన్‌’తో బహుళ ప్రయోజనాలు

అనంతపురం అర్బన్‌: ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో తీసుకువచ్చిన ఆటోమేషన్‌ కార్యక్రమంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ పిలుపునిచ్చారు. ‘ఆధునిక సాగు – ఏపీఎంఐపీ ఆటోమేషన్‌ పథకం’ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ భవనంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌తో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించి, మాట్లాడారు. సూక్ష్మ నీటి సాగులో భాగంగా ఆటోమేషన్‌ను ప్రోత్సహించేందుకు, నీటి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, రైతులకు శ్రమ తగ్గించేందుకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు వివరించారు. హెక్టారుకు రూ. 40వేల సూచిక వ్యయంపై సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఏపీఎంఐపీ హెల్ప్‌ లైన్‌ 1800 425 2960, 79950 87057 లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మలోల, ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఏపీఎంఐిపీ పీడీ రఘునాథరెడ్డి, జెడ్పీ సీఈఓ శివశంకర్‌, జిల్లా సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.

మార్చిలో గుత్తికోట ఉత్సవాలు

జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, మార్చిలో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా పర్యాటక కౌన్సిల్‌ చైర్మన్‌ హోదాలో కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు జాయింట్‌ కలెక్టర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పర్యాటక అభివృద్ధి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఉరవకొండ, గుంతకల్లు, ఆత్మకూరు మండలాల్లో పర్యాటక అభివృద్ధికి స్థలాలను గుర్తించినట్లు కౌన్సిల్‌ దృష్టికి పర్యాటక శాఖ అధికారి జయకుమార్‌ బాబు తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బోటింగ్‌ నిర్వహణకు అనుమతులను ఏపీటీడీసీ ద్వారా తెప్పించి కార్యకలాపాలను ప్రారంభించాలని చెప్పారు. ఆర్కియాలజీ మ్యూజియం, పాతకాలం నాటి జిల్లా జైలు, పీస్‌ మెమోరియల్‌ హాల్‌, సైన్స్‌ సెంటర్‌, శిల్పారామానికి సందర్శకులు నిరంతరం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్క్‌ అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేసి వారంలోపు అందించాలని చెప్పారు.

లీజుకు పర్యాటక స్థలాలు

అనంతపురం అర్బన్‌ పరిధిలోని క్యాన్సర్‌ ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, జేఎన్‌టీయూ సమీపంలో పర్యాటక శాఖకు సంబంధించిన స్థలాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ స్థలాల్లో మంచి డీలక్స్‌ హోటళ్ల ఏర్పాటుకు లీజుకు ఇచ్చేందుకు నిబంధనల మేరకు ప్రాసెస్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, పర్యాటక శాఖ అధికారి జయకుమార్‌బాబు, డీఈఓ ప్రసాద్‌బాబు, నగర పాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌రావు, డ్వామా పీడీ సలీమ్‌బాషా, అర్కియాలజీ ఏడీ స్వామినాయక్‌, కమిటీ సభ్యులు దామోదర్‌ గౌరంగదాస్‌ ప్రభు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement