
టోక్యో: రైళ్ల ఆలస్యానికి మనం అలవాటు పడిపోయాం. గంటల తరబడి రైళ్లు ఆలస్యంగా నడవడం మనకు కొత్తేం కాదు.అయితే జపాన్‌లో ఓ రైల్వే కంపెనీ తన రైళ్లలో ఒకటి నిర్ణీత సమయం కంటే కేవలం 20 సెకన్లు ముందుగా వెళ్లినందుకు ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పింది. టోక్యో-సుకుబ నగరాల మధ్య నడిచే సుకుబ ఎక్స్‌ప్రెస్ మినామి నగరేయమ స్టేషన్ వద్ద స్ధానిక సమయం ప్రకారం 9:44:40కు స్టేషన్ నుంచి వెళ్లాల్సిఉండగా, 9:44:20కు వెళ్లిపోయింది.
సిబ్బంది టైమ్‌టేబుల్‌ను సరిగ్గా చెక్ చేసుకోకపోవడంతోనే ఈ పొరపాటు చోటుచేసుకుందని కంపెనీ పేర్కొంది. డిపార్చర్ టైమ్‌ను చూసుకోకుండానే సిబ్బంది తదుపరి స్టేషన్ దిశగా రైలును నడిపించారని తెలిపింది. అయితే ప్రయాణీకులెవరూ దీనిపై ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.
20 సెకన్లు ముందుగా వెళ్లినందుకు తలెత్తిన అసౌకర్యానికి మన్నించాలంటూ సదరు రైల్వే సంస్థ ప్రకటన చేయడంతో ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. పలువురు సోషల్ మీడియా వేదికగా కంపెనీ క్షమాపణలపై స్పందించారు.