'మిస్సైళ్లు పేల్చకయ్యా..!' అని పొరుగుదేశాలు అభ్యర్థించిన కొద్ది గంటలకే ఉత్తరకొరియా నియంత నేత మళ్లీ రెచ్చిపోయాడు.
సిన్పో: దీపావళి టపాసుల వెలుగులు చూస్తూ పిల్లలు గంతేసినట్లు.. ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిమంతమైన మిస్సైళ్లు పేల్చుతూ ఆనందిస్తాడు కిమ్ జాంగ్ ఉన్. మొదటిది సంతోషమైతే, రెండోది క్రూరత్వం.. ఉన్మాదం తలకెక్కిన నియంతృత్వం! 'మిస్సైళ్లు పేల్చకయ్యా..!' అని పొరుగుదేశాలు అభ్యర్థించిన కొద్ది గంటలకే ఉత్తరకొరియా నియంత నేత మళ్లీ రెచ్చిపోయాడు.
ఉత్తరకొరియా తీరపట్టణం సిప్నోలోని జలాంతర్గామి క్షేత్రం నుంచి బుధవారం ఉదయం మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణిని.. నియంత నేత కిమ్ జాంగ్ సమక్షంలో కొరియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. జలాంతర్గామి నుంచి సముద్రపు నీటిని చీల్చుకుంటూ గాలిలోకి ఎగిరిన ఈ క్షిపణి సరాసరి జపాన్ సరిహద్దులో పడింది. దీంతో జపాన్ అగ్గిమీద గుగ్గిలమైంది.
ఆదివారమే కొరియాను తీవ్రంగా తప్పుపట్టిన జపాన్ అధ్యక్షుడు షిజో అబే బుధవారం మరోసారి కిమ్ జాంగ్ చర్యను తూర్పారపట్టారు. 'ఇది క్షమించరాని చర్య'అని ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు దక్షిణకొరియా కూడా కిమ్ జాంగ్ వరుస క్షిపణి పరీక్షలపై ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఉత్తరకొరియా దూకుడుకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఒక్కతాటిపైకి రావాలని జపాన్, దక్షిణకొరియా, చైనాలు నిర్ణయించుకున్నాయి.