మార్కెట్ల జోష్.. మెటల్ షేర్ల భారీ ర్యాలీ | Markets snap 4-day losing streak; Nifty above 5,400 | Sakshi
Sakshi News home page

మార్కెట్ల జోష్.. మెటల్ షేర్ల భారీ ర్యాలీ

Aug 23 2013 2:12 AM | Updated on Sep 1 2017 10:01 PM

మార్కెట్ల జోష్.. మెటల్ షేర్ల భారీ ర్యాలీ

మార్కెట్ల జోష్.. మెటల్ షేర్ల భారీ ర్యాలీ

రూపాయి క్షీణిస్తున్నదన్న భయాలతో అదేపనిగా పతనమై కనిష్టధరల్లో లభిస్తున్న బ్లూచిప్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడంతో గురువారం స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ జరిగింది.

రూపాయి క్షీణిస్తున్నదన్న భయాలతో అదేపనిగా పతనమై కనిష్టధరల్లో లభిస్తున్న బ్లూచిప్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడంతో గురువారం స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ జరిగింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక్కసారిగా 407 పాయింట్లు ర్యాలీ జరిపింది. దాంతో నాలుగురోజుల మార్కెట్ పతనానికి బ్రేక్‌పడింది. సెన్సెక్స్ ఇంత భారీగా పెరగడం గత రెండు నెలల్లో ఇదే ప్రధమం. రూపాయి మరో కొత్త కనిష్టస్థాయికి తగ్గినా, చలించని ఇన్వెస్టర్లు మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్ల బలహీనత కారణంగా ట్రేడింగ్ తొలిదశలో సెన్సెక్స్ 17,759 పాయింట్ల వద్దకు క్షీణించింది. 
 
 ఆ సమయంలో వువ్వెత్తున షార్ట్ కవరింగ్, తాజా కొనుగోళ్లు ప్రారంభంకావడంతో ర్యాలీ జరిగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కనిష్టస్థాయి నుంచి సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగి 18,350 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 5,260 పాయింట్ల కనిష్టం నుంచి 5,400 పాయింట్ల ఎగువకు దూసుకెళ్లింది. చివరకు 106 పాయింట్ల లాభంతో 5,408 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్థిక ఉద్దీపన కోసం నిధుల విడుదలను క్రమేపీ తగ్గించాలన్న అభిప్రాయంతో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు ఉన్నట్లు ఫెడ్ కమిటీ సమావేశపు మినిట్స్ ద్వారా తేటతెల్లమయ్యింది. దాంతో రూపాయి క్షీణించగా, బ్యాంకింగ్ షేర్లలో మాత్రం అమ్మకాలు కొనసాగాయి. 
 
 అయితే లోహాలను భారీగా వినియోగించే చైనా తయారీ రంగం ఆగస్టులో బాగా మెరుగుపడినట్లు తాజా గణాంకాలు వెలువడటంతో మెటల్ షేర్లు గురువారంనాటి ర్యాలీకి శ్రీకారం చుట్టాయి. హిందాల్కో, టాటా స్టీల్, సేసా గోవా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, ఎన్‌ఎండీసీ తదితర మెటల్ షేర్లు 8-15 శాతం మధ్య పెరిగాయి. ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్‌లకు కొనుగోలు మద్దతు లభించడంతో అవి 3-16 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. కొద్ది రోజుల నుంచి అమ్మకాల ఒత్తిడిని చవిచూస్తున్న ఆయిల్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌లు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 1277 కోట్ల విలువైన నికర విక్రయాలు జరిపినట్లు సెబి డేటా పేర్కొంది.  క్యాష్ మార్కెట్లో కొన్ని బ్యాంకింగ్ షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల జరిపిన అమ్మకాలను ఈ డేటా సూచిస్తోంది. దేశీయ సంస్థలు రూ. 389 కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి.
 
 నిఫ్టీలో షార్ట్ కవరింగ్...
 కొద్ది రోజుల నుంచి నిఫ్టీ ఫ్యూచర్లలో అదేపనిగా షార్ట్ చేస్తున్న ఇన్వెస్టర్లు గురువారం కనిష్టస్థాయికి సూచీ క్షీణించగానే షార్ట్ కవరింగ్ జరిపారు. ఈ కవరింగ్‌ను సూచిస్తూ నిఫ్టీ ఆగస్టు కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ నుంచి 6.85 లక్షల షేర్లు (2.83 శాతం) కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 2.35 కోట్ల షేర్లకు దిగింది.
 
  అయితే గత 4 రోజులుగా యాడ్ అయిన ఓఐతో పోలిస్తే తాజాగా కట్ అయిన శాతం తక్కువ. రూపాయి పతనం నిలిచిపోయేంతవరకూ ఇన్వెస్టర్లు తగిన మోతాదులో షార్ట్ పొజిషన్లను కొనసాగించవచ్చని విశ్లేషకులు చెప్పారు. 5,300, 5,400 స్ట్రయిక్స్ వద్ద కాల్ కవరింగ్ జరగ్గా, 5,500 స్ట్రయిక్ వద్ద తాజా కాల్ రైటింగ్ జరిగింది. 5,300, 5,400 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరిగింది. 5,500 స్ట్రయిక్ వద్ద కాల్ బిల్డప్ 71 లక్షల షేర్లకు చేరగా, 5,300 స్ట్రయి క్ పుట్ ఆప్షన్లో బిల్డప్ 83 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 5,500-5,300 శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఈ డేటా సూచిస్తున్నది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement