
భారత్ నివేదనను తిరస్కరించిన పాక్
కుల్ భూషణ్ ను కలుసుకునే అవకాశం కల్పించాలన్న అతని తల్లి నివేదనను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది.
- కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్షపై తల్లి అప్పీలు
- పాక్ విదేశాంగ కార్యదర్శితో భారత రాయబారి చర్చలు విఫలం
ఇస్లామాబాద్: మరణ శిక్షకు గురైన భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ మరోసారి కరుకుతనాన్ని ప్రదర్శించింది. కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించడంతోపాటు, ఒకమారు కలుసుకునే అవకాశం కల్పించాలన్న అతని తల్లి నివేదనను దాయాది ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
బుధవారం పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనా జాంగ్వాతో భారత రాయబారి గౌతం బంబావాలే జరిపిన చర్యలు విఫలం అయ్యాయి. భారత నౌకాదళం మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ యాదవ్ ను గూఢచారిగా పేర్కొంటూ పాక్ ఆర్మీ కోర్టు అతనికి మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్ష రద్దు కోసం భారత్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కుల్ భూషణ్ భవితవ్యంపై అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కన్నతల్లి రోదననూ పట్టించుకోలేదు..
పాకిస్థాన్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 133(బి) ప్రకారం.. ఆర్మీ కోర్టు విధించే శిక్షలను ప్రభుత్వం రద్దుచేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారమే తన కొడుకు విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కుల్ భూషణ్ తల్లి.. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. కన్నకొడుకును చూసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రాధేయపడింది. ఈ మేరకు ఆమె చేసుకున్న అప్పీలు పత్రాలను భారత రాయబారి గౌతం బాంబావాలే.. పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనాకు అందించారు. దీనిపై తెహ్మీనా బదులిస్తూ 'సాధారణ ఖైదీల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉండేదేమో, కానీ, గూఢచారుల విషయంలో, వారికి విధించిన శిక్షల విషయంలో మేమేమీ చెయ్యలేం..'అని తేల్చిచెప్పారు. ఈ ప్రయత్నం కూడా విఫలం కావడంతో కుల్ భూషణ్ విషయంలో భారత ప్రభుత్వం తర్వాతి అడుగు ఏమిటనేది ఆసక్తిగా మారింది.