విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడినందుకు అమెరికాలో ఎన్నారై ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.
విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడినందుకు అమెరికాలో ఎన్నారై ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బేటన్ రోగ్ ప్రాంతంలో నివసించే దేవేందర్ సింగ్ (61) ప్రయాణిస్తున్న విమానం నెవార్క్లో ల్యాండ్ అవ్వగానే ఎఫ్బీఐ వర్గాలు అక్కడకు చేరుకుని మరీ ఆయనను అరెస్టు చేశాయి. లైంగిక దాడి చేసినందుకు గాను ఒక కౌంటు కేసు నమోదు కావడంతో ఆయనను న్యూజెర్సీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు రుజువైతే దేవేందర్ సింగ్కు గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, కోటిన్నర రూపాయల జరిమానా విధించే అవకాశముంది.
హ్యూస్టన్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు కిటికీ పక్కన సీట్లో కూర్చోగా, ఆ పక్క సీట్లో సింగ్ కూర్చున్నారు. ఆమెకు సింగ్ ఎవరో తెలీదు. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఆమె నిద్రపోయింది. తాను నిద్రలో ఉండగానే సింగ్ తనను ముఖం మీద ముద్దు పెట్టుకున్నారని, అనంతరం లైంగిక దాడి కూడా చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాసేపటికి మెలకువ రావడంతో ఆయనను పక్కకు తోసేసి, విమాన సిబ్బంది వద్దకు వెళ్లానని.. విమానం ల్యాండ్ అయ్యేసరికి అక్కడకు పోలీసులను పిలవాల్సిందిగా వారికి చెప్పానని ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు.