సమ్మె విరమణపై నేడు నిర్ణయం

TSRTC Strike : RTC JAC Sadak Bandh Postponed - Sakshi

  నేడు ఆర్టీసీ జేఏసీ భేటీ

మంగళవారం నాటి సడక్‌ బంద్‌ నిర్ణయం ఉపసంహరణ

నిరశన దీక్ష విరమించిన నేతలు

సాక్షి, హైదరాబాద్‌ : నెలన్నరగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మిక న్యాయస్థానం పరిధిలోకి ఈ అంశం వెళ్లిన నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా.. వద్దా? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమా వేశం ఏర్పాటు చేసింది. ఇందులో సమ్మె కొనసాగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జేఏసీ సమావేశానికి ముందు.. అందులో భాగంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించనున్నారు. అనంతరం జేఏసీ భేటీలో ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్‌ బంద్‌ నిర్ణయాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె విరమణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కార్మిక సంఘాలకు సమ్మె విరమణ విషయంలో సూచనలు చేస్తానంటూ జేఏసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి జేఏసీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం వాదనల అనంతరం ధర్మాసనం పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల ప్రతి వెంటనే అందనందున సమ్మె విషయంలో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రతిని పరిశీలించిన మీదట మంగళవారం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించి, మూడు రోజులు దీక్ష కొనసాగించిన జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు సోమవారం సాయంత్రం దీక్ష విరమించారు. వీరిని ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించినా దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, పలువురు ప్రజా సంఘాల నేతలు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. హైకోర్టులో జరిగిన వాదనల్లో కీలక పరిణామాల నేపథ్యంలో అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తమ సమ్మె కొనసాగుతుందని, మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్‌ బంద్‌ను వాయిదా వేస్తున్నామని, సాయంత్రం జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.  

72.49 శాతం బస్సులు తిప్పాం – ఆర్టీసీ యాజమాన్యం 
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 72.49 శాతం బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 1,912 అద్దె బస్సులు సహా 6,487 బస్సులను తిప్పినట్లు పేర్కొంది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,487 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని వెల్లడించింది. 

44వ రోజూ కొనసాగిన కార్మికుల సమ్మె  
అక్టోబర్‌ ఐదోతేదీన మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతూ సోమవారంతో 44 రోజులు పూర్తి చేసుకుంది. సమ్మె విరమించి విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వం మూడు దఫాలు చేసిన సూచనలను కూడా కార్మికులు బేఖాతరు చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ నేతలకు సంఘీభావంగా అన్ని బస్‌ డిపోల వద్ద కార్మికులు సంఘీభావ దీక్షలు కొనసాగించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top