ఈఆర్సీ ససేమిరా..!  

TSERC Rejects DISCOMs Request Of Deadline For Submission Of Proposals For Increase Electricity Tariff - Sakshi

విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనల సమర్పణకు గడువు పొడిగించలేమని స్పష్టం

డిస్కంలు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి

ఇప్పటికే జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ పిటిషన్‌ వేయాలని ఆదేశం

ఈ నెల 30లోగా ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించే అవకాశం..  

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు జూన్‌ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా తోసిపుచ్చింది. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలను గతే డాది నవంబర్‌ 30లోగా సమర్పించాల్సి ఉండగా, డిస్కంలు వివిధ కారణాలు చూపుతూ పలు దఫాలుగా గడువు పొడిగింపు కోరుతూ వచ్చాయి. చివరిగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించినా, డిస్కంలు ఏఆర్‌ఆర్‌ నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమయ్యా యి. మరింత కాలం గడువు పొడిగింపు కోరుతూ అప్పట్లో డిస్కంలు ఈఆర్సీకి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయలేకపోయాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మార్చి 24 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో గడువు పొడిగింపు కోరలేకపోయాయి. గడువు ముగిసిన 2 నెలల తర్వాత మళ్లీ జూన్‌ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని కోరుతూ ఇటీవల డిస్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ససేమిరా నిరాకరించింది. ఏఆర్‌ఆర్‌ నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించే సమయంలోనే ఇప్పటివరకు జరిగిన జాప్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేస్తూ మరో పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జూన్‌ 1న డిస్కంలకు ఈఆర్సీ లేఖ రాసింది. చివరిసారిగా పొడిగించిన గడువు మార్చి 31తో ముగిసిపోగా, ఆ గడువులోపే మళ్లీ గడువు పొడిగింపు కోసం విజ్ఞప్తి చేయాల్సి ఉండగా డిస్కంలు విఫలమయ్యాయి. రెండు నెలల ఉల్లంఘన తర్వాత గడువు కోరడం వల్లే ఈఆర్సీ అంగీకరించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

త్వరలో చార్జీల పెంపు ప్రతిపాదనలు.. 
గడువు పొడిగింపునకు ఈఆర్సీ నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు ఏఆర్‌ఆర్‌ నివేదికను డిస్కంలు వెంటనే ఈఆర్సీకి సమర్పించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు మళ్లీ కసరత్తు ప్రారంభించాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలు విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు గత ఆరు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా, వివిధ రకాల ఎన్నికలు, రాజకీయ కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలను సైతం డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. గత మూడేళ్లకు పైగా రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. దీంతో డిస్కంలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని.. గతంలో ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్‌ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. 2019–20 ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల ఆర్థిక లోటు రూ.12 వేల కోట్లకు చేరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని అర్జించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. విద్యుత్‌ సంస్థల సీఎండీలు త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఈ పరిస్థితులను వివరించి చార్జీల పెంపునకు అనుమతి కోరే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతిస్తే జూన్‌ 30లోగా ప్రతిపాదనలు సమర్పించే అవకాశాలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top