‘విద్యుత్‌’ ఎత్తిపోతలే! 

Telangana Government Produce Non Stop Power - Sakshi

ఎత్తిపోతల పథకాలకు 3,500 మెగావాట్ల విద్యుత్‌ 

సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు 

ఇందుకోసం అదనంగా 2 వేల మెగావాట్ల సమీకరణ 

1,000 మెగావాట్ల కొనుగోళ్లకు స్వల్పకాలిక టెండర్లు 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సరఫరాలో రాష్ట్రం మరో మైలురాయిని అందుకోబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో ఏర్పడిన తీవ్ర కొరతను అధిగమించి అనతి కాలంలోనే కోతలు లేని నిరంతర విద్యుత్‌ సరఫరాను అందించింది. తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు భారీ ఎత్తిపోతల పథకాలకు పెద్ద మొత్తంలో విద్యుత్‌ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది నుంచే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తరలించుకోవడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు విద్యుత్‌ సరఫరాను ప్రారంభిస్తే రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా 12,500–13,000 మెగావాట్లకు పెరగనుంది. ఇప్పటికే 10,500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు సన్నద్ధమై ఉండగా, వివిధ మార్గాల నుంచి మరో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.  

‘ఆగస్టు–జనవరి’ ప్రధానం 
ఏటా ఆగస్టు–జనవరి మధ్య కాలంలో గోదావరి నదిలో నీటి లభ్యత ఉంటుంది. దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర పాత ఎత్తిపోతల ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం పథకం ద్వారా ఈ సమయంలో నీటిని తోడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు–జనవరి మధ్య కాలంలో నీటిపారుదల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్‌ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. వచ్చే జూలై 16 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా టెండర్లను ఆహ్వానించాయి. సెప్టెంబర్‌ తర్వాత విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే మళ్లీ 1,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోళ్లను కొనసాగించనున్నాయి. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి వారం మరో 1,000 మెగావాట్ల కొనుగోళ్లు జరపాలని భావిస్తున్నాయి.

ఖరీఫ్‌లో 23 లక్షల బోరు బావుల కింద పంటలతోపాటు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా అందిస్తే రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 12,500 నుంచి 13,000 మెగావాట్లకు చేరనుందని అంచనా వేశాయి. దీంతో రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ రికార్డులో స్థాయిలో పెరగనుంది. గత మార్చి 8న నమోదైన 10,220 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఇప్పటి వరకు అత్యధికం. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 13 వేల మెగావాట్లకు చేరినా సరఫరా చేసేందుకు విద్యుత్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎత్తిపోతల పథకాలకు 3,500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 1,900 మెగావాట్లు అవసరం కాగా, ఇప్పటికే వినియోగంలో ఉన్న దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర పథకాలకు మరో 1,600 మెగావాట్ల విద్యుత్‌ అవసరం కానుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top