ఆర్టీసీకి రూ.500 కోట్లే..! 

Shock to RTC In this budget also - Sakshi

బడ్జెట్‌లో ఆర్టీసీకి లభించని ఊరట 

సాక్షి, హైదరాబాద్‌: తాజా బడ్జెట్‌లో ఆర్టీసీకి తీవ్ర నిరాశే ఎదురైంది. వేతనాలు చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడుతున్న సంస్థకు.. బడ్జెట్‌లో ఊరట లభించలేదు. బస్‌ పాస్‌ రాయితీలు భరించినందుకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు చేసే మొత్తానికి సంబంధించి రూ.680 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరగా రూ.500 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇక బ్యాంకు రుణాలను చెల్లించేందుకు రూ.200 కోట్లు కావాలని కోరగా రూ.50 కోట్లు మాత్రమే ప్రకటించింది. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.150 కోట్లు కోరగా, ప్రభుత్వం ఆ పద్దు జోలికే వెళ్లలేదు. పొరుగు రాష్ట్రం ఏపీ అక్కడి ఆర్టీసీకి రూ.1,572 కోట్ల ఆర్థిక సాయాన్ని బడ్జెట్‌ లో ప్రకటిస్తే ఇక్కడ రూ.550 కోట్లే ప్రతిపాదించటం సరికాదని ఎన్‌ఎంయూ నేత నాగేశ్వర్‌రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

వీటికి కేటాయింపుల్లేవ్‌.. 
- మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఈసారి ప్రభుత్వం మొండిచేయి చూపింది. గత బడ్జెట్‌లో రూ.460 కోట్లు ప్రకటించి చివరకు రూ.378 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్‌లో ఆ పద్దు జాడే లేదు. 
గజ్వేల్‌ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్‌లో రూ.80 కోట్లు ప్రతిపాదించి, రూ.66 కోట్లకు సవరించారు. 
జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.500 కోట్లుగా చూపారు. చివరకు దాన్ని రూ.411 కోట్లకు సవరించారు. తెలంగాణ కళాభారతి లాంటి ప్రతిపాదనలను కూడా పక్కనపెట్టేసింది. 
పర్యాటక శాఖ, హెరిటేజ్‌ తెలంగాణకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top