మూగబోయిన ‘మీనా ప్రపంచం’ | schools in without radios | Sakshi
Sakshi News home page

మూగబోయిన ‘మీనా ప్రపంచం’

Dec 4 2014 3:17 AM | Updated on Jul 26 2019 6:25 PM

విందాం.. తెలుసుకుందాం అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన మీనా ప్రపంచం రేడియో కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో మూగబోయింది.

- పాఠశాలల్లో మూలనపడ్డ రేడియోలు
- పట్టించుకోని అధికారులు

నేరడిగొండ : విందాం.. తెలుసుకుందాం అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన మీనా ప్రపంచం రేడియో కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో మూగబోయింది. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు పాఠశాలలకు పంపిణీ చేసినా రేడియోలు అటకెక్కాయి. 2012 సెప్టెంబర్ 5న ప్రభుత్వం మీనా ప్రపంచం కార్యక్రమాన్ని ప్రారంభించగా అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభించిన నెలకు రేడియోలు మూలనపడ్డాయి.మండలంలో మొత్తం 74 పాఠశాలలు ఉన్నాయి.

అందులో ప్రాథమిక పాఠశాలలు 59, ప్రాథమికోన్నత 5, ఉన్నత 5, ఆశ్రమ పాఠశాలలు 3,కస్తుర్బా 1,మినీ గురుకులం 1 ఉన్నాయి. మండలంలో ఒకటి రెండు పాఠశాలల్లో మినహా మీనా ప్రపంచం రేడియో కార్యక్రమం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 నుంచి 11:30 వరకు విందాం తెలుసుకుందాం కార్యక్రమం ప్రసారమవుతోంది. కానీ రేడియోలు వినియోగంలో లేక అసలు మీనా ప్రపంచం గురించే తెలియదని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. మరికొన్నింటిలో ఆకాశవాణి సిగ్నల్ అందక పోవడంతో కార్యక్రమం ప్రసారం కావడంలేదు. దీంతో రేడియోలు బీరువాలకే పరిమితమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో అసలు రేడియోలే కనిపించకుండా పోయాయని ఆరోపణలు వస్తున్నాయి.
 
దీనిని పర్యవేక్షణ చేసే అధికారులు లేక ఆర్వీఎం, యునిసెఫ్ సంయుక్తంగా అమలు చేసిన మీనా ప్రపంచం కనుమరుగవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు బాలల హక్కులు లింగ వివక్ష స్నేహ పూర్తి పాఠశాలలు అనే మూడు అంశాలపై మీనా ప్రపంచం ఉంటుంది. వీరికి సోమవారం నుంచి బుధవారం వరకు ఆకాశవాణి ద్వారా ఉదయం 11:45 నుండి 12:00 వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మొదట మీనా కథ, రెండో భాగం అందరు పాడగలిగే పాట, మూడో భాగంగా విద్యార్థులతో ఆట, ఫజిల్, క్విజ్‌ను విద్యార్థులకు వినిపించాలి.

అందుకు గానూ పాఠశాలల్లో విద్యార్థుల నిధులతో రేడియోలు సమకూర్చుకోవాలి. మధ్యలో అంతరాయం కలగకుండా బ్యాటరీలు ఏర్పాటుచేసుకోవాలి. ఈ కార్యక్రమ అమలు గతంలో కొనుగోలు చేసిన రేడియోలు కొన్ని పాఠశాలల్లో ఉండగా మరికొంత మంది నిధులు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమం అమలుకు పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కానీ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే మీనా ప్రపంచం మూగబోతోందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement