బేఖాతర్‌..!

Road Accidents Due To Drivers Negligence In Mahabubanagar - Sakshi

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేసినా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావడంలేదు. వారు చేసే చిన్న చిన్న తప్పిదాల మూలంగా.. ఎందరో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మద్యం మత్తులో.. సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ.. స్థాయికి మించి ఎక్కించుకొని డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వారి వాహనాలతోపాటు ఎదురుగా వచ్చే వాహనాల్లోని అమాయకులు విగతజీవులుగా మారుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఇంటి పెద్ద దిక్కును.. తోబుట్టువులను.. బంధువులను.. మరెందరినో కోల్పోవడమేగాక..  ఆ కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నాయి.

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మోటార్‌ బైక్‌లు, ఆటోలు,ట్రాక్టర్లు, లారీలు,తదితర వాహణాలు నడుపుతున్న వారు నిర్లక్షంగా డ్రైవ్‌ చేయడంతో రోడ్డుపై వెళ్లే అమాయక ప్రజలు బలవుతున్నారు. వీరితో పాటు డ్రైవ్‌ చేస్తున్న వారు సైతం తమ ప్రాణాలను కాపాడుకోలేక పోతున్నారు. ఒక్కో సారి తీవ్ర గాయాలతో ఇట్టే ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. రోడ్డుపైకి ఎక్కిన వాహనాలను నడుతున్న సమయంలో కనీస అవగాహనతో నడపక పోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు 
రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడుపుతున్నారు. ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలన ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా సంభవిస్తుంది. అంతేగాక డ్రైవింగ్‌ చేయడానికి సైతం వీలు లేకుండా డ్రైవింగ్‌ సీటు పక్కను అటు ఇటుగా నలుగురిని సైతం ఎక్కించుకోవడంతో రోడ్డుపై సక్రమంగా డ్రైవ్‌ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కో ఆటోలో 15 నుంచి 20 మందికి పైగా ప్రయాణికులను చేరవేస్తున్న ఆటోలు నిత్యం అనేకంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయ పనులకు సంబందించి వివిధ గ్రామాల నుంచి సంబంధిత వ్యవసాయ క్షేత్రాలకు కూలీలను చేరవేస్తున్న ఆటోలు కూడా ఇదే రీతిలో రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

విద్యాసంస్థల విద్యార్థులను చేరవేస్తున్న ఆటోలు, బస్సుల పరిస్థితి ఇలాగే ఉంది. ఆటోలో కిక్కిరిసిన ప్రయాణికులకు తోడు భారీ శబ్దంతో కూడిన లౌడ్‌ స్పీకర్ల వినియోగం, మద్యం సేవించి నడపడం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ మాట్లాడడం, తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాక పట్టాణాల్లో ప్రయాణికుల కోసం రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆకస్మికంగా బ్రేక్‌ వేయడంతో వెనకే వస్తున్న వాహనదారులు ఆటోను ఢకొట్టి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మొబైల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌
ఇటీవల మోటార్‌ బైక్‌లతో పాటు అన్ని రకాల వాహనాలను నడుపుతున్న వారు మొబైల్‌ ఫోన్‌లను మాట్లాడుతు డ్రైవ్‌ చేస్తున్నారు.మరికొందరయితే వాట్సాప్‌లలో చాట్‌ చేస్తూ మరీ డ్రైవింగ్‌ చేస్తున్నారంటే పరిస్థితిని ఊహించవచ్చు. సురక్షితమైన ప్రయాణానికి చిరునామాగా చెప్పుకుంటున్న ఆర్‌టీసీ బస్సు డ్రైవర్లు సైతం ఇలాగే వ్యవహరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
డ్రైవింగ్‌ నిర్లక్ష్యం వలన పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా కొత్తపల్లి వద్ద ఆటోను లారీ డీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాత పడిన విషయం విధితమే. ఇంతకు ముందు కూడా కావేరమ్మపేట వద్ద జాతీయరహదారిని దాటుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్లు, వేగం, తదితర వాటిపై అంతగా అవగాహన లేకుండా వాహనాలను డ్రైవ్‌ చేయడంతో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. మైనర్లు సైతం బైక్‌లు, వాహనాలు నడుపతుండడం పట్ల రోడ్డుపై వెళ్లే ప్రజలు కలవరపడుతున్నారు.

రవాణా శాఖ, పోలీస్‌ శాఖ అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఎప్పటికప్పడు తనిఖీలు చేస్తూ ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి సారిస్తూ, వాహనాల రాకపోకలను సమీక్షిస్తే కొంతమేరకైనా ప్రమాదాలను నియంత్రించే పరిస్థితి ఉంటుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఆటో (ఫైల్‌) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top