ఎన్నాళ్లీ.. నిరీక్షణ!

Ration Card Distribution Delay in Nalgonda - Sakshi

నాలుగేళ్లుగా మంజూరు కాని ఆహారభద్రత కార్డులు

ఎప్పుడు వస్తాయో స్పష్టత ఇవ్వని అధికారులు 

అందకుండా పోతున్న ప్రభుత్వ పథకాలు

సవరణల కోసం వచ్చిన అర్జీలు 18,637 

ఎదురుచూపుల్లో 10,687మంది కొత్త దరఖాస్తుదారులు

ఈ ఫొటోలోని మహిళ ఆలేరుకు చెందిన బొల్లారం స్రవంతి. ఆహారభద్రత కార్డు కోసం 18నెలల క్రితం మీసేవలో దరఖాస్తు చేసుకుంది.   భర్త, కుమారుడు ఉన్నారు.  పిండిగిర్నీ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలల పాటు షాపులు మూసివేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. తహసీల్దార్‌ కార్యాలయంలో రెండు, మూడుసార్లు అడిగినప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా పౌరసరఫరాల సంస్థకు ఫార్వడ్‌ చేశామని, ఆన్‌లైన్‌లోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రతినెలా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్‌ సరుకులను పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా కార్డును మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.  

సాక్షి యాదాద్రి : ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను పొందడానికి అర్హత కలిగిన దాదాపు పదివేలమందికిపైగా పేదలు ఆహార భద్రత కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా కార్డులు మంజూరు కాకపోవడంతో వివిధ పథకాల ఫలాలు అందుకోలేకపోతున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార భద్రతా కార్డు ప్రామాణికంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆహారభద్ర కార్డుల పేద లబ్ధిదారులు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని 17మండలాలు, 6 మున్సిపాలిటీల్లో కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత బియ్యం, కందిపప్పు, నగదు వంటి వాటికి ఆహార భద్రత కార్డులు తప్పనిసరిగా ఉండాలి. కార్డులు లేనివారికి ప్రభుత్వ పథకాలు అందడంలేదు. దీంతోపాటు బతుకమ్మ చీరలు,ఆదాయ సర్టిఫికెట్లు పొందడానికి కూడా ఆహార భద్రత కార్డులు అవసరం అవుతున్నాయి. అయితే నూతన కార్డులతోపాటు, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా నాలుగేళ్లుగా కార్డులు మంజూరు కాని దుస్థితి నెలకొంది. 

అంతటా పెండింగే..
ఆహార భద్ర కార్డుల మంజూరు కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆయా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ విచారణ జరిపి తహసీల్దార్‌ లాగిన్‌కు పంపిస్తారు. అక్కడ తహసీల్దార్‌ పరిశీలించిన తర్వాత డీఎస్‌ఓ లాగిన్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. అక్కడ కార్డును జారీ చేసి దానికి అవసరమైన రేషన్‌ సరుకులను కేటాయిస్తారు. అయితే దరఖాస్తులు పెద్దఎత్తున ఆర్‌ఐల వద్దనే పెండింగ్‌ ఉంటున్నాయి. తహసీల్దార్ల వద్దను డీఎస్‌ఓ లాగిన్‌కు వెళ్లినప్పటికీ అక్కడ కూడా మంజూరు కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రభుత్వం కార్డుల జారీకి అనుమతి ఇవ్వకపోవడం వల్లే నూతన కార్డుల మంజూరు, మార్పులు చేర్పులు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమకు కార్డులు ఇప్పించాలని ప్రజావాణికి పెద్ద ఎత్తున దరఖాçస్తులు వస్తున్నాయే తప్ప ఒక్క కార్డు కూడా మంజూరు కావడం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top