జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం | ponguleti srinivasa reddy took first petition letter | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం

May 24 2014 2:46 AM | Updated on Sep 2 2017 7:45 AM

జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం

జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం

సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తనను, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

వైరా, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తనను, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా మండలం ముసలిమడుగులోని పురాతన అభయాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన హనుమజ్జయంతి ఉత్సవాల లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌తో కలిసి ఆయన పూజలు నిర్వహించారు.

 ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ఎజెండాగా తమ పార్టీ పని చే స్తుందని చెప్పారు. జిల్లా ప్రజలు విజ్ఞులని, అందుకే వైరా, ఆశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి మహానేత రుణం తీర్చుకున్నారని అన్నారు. పేద , మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, కార్మికులకు నిత్యం అందుబాటులో ఉండి వారి పక్షాన పార్టీ పనిచేస్తుందన్నారు. తమను గెలిపించిన ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అండదండలతోనే గెలుపొందామని, వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో పార్టీకి సేవలందిస్తామన్నారు. కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని, ఏ క్షణంలోనైనా వారి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

 పొంగులేటికి తొలి వినతిపత్రం...
 ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌కు మండలంలోని చెరుకు రైతులు, ముసలిమడుగు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. వైరా రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సాగులో ఉన్న చెరకు పంటకు సాగు నీరు విడుదల చేయాలని, గ్రామంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, రహదారుల  నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. దీనికి స్పందించిన పొంగులేటి సాగునీటి సమస్యపై వెంటనే  నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, వైరా, గరికపాడు సర్పంచ్‌లు బాణోత్ వాలీ, శీలం కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు తన్నీరు జ్యోతి, తడికమళ్ల నాగేశ్వరరావు, నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోషయ్య, షేక్ లాల్‌మహ్మద్, తన్నీరు నాగేశ్వరరావు, చింతనిప్పు రాంబాబు, కొరివి నర్సింహరావు, సుబ్బిరెడ్డి, దేవరాజ్, కౌసర్, తేలప్రోలు నర్సింహరావు, బాణోత్ కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement