'వలసపోయినోళ్లు వాపసు వస్తుండ్రు'

'వలసపోయినోళ్లు వాపసు వస్తుండ్రు' - Sakshi


ఎల్లంపల్లికి మరో 4వేల ఎకరాల భూసేకరణ

జీవో 123 వచ్చాకే రైతులకు లాభం మంత్రి హరీశ్‌రావు

ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్-2, ఫేస్-1 ప్రారంభం


సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుండటంతో వలసపోయినోళ్లు వాపసు వస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్-2, ఫేస్-1ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఫాజుల్‌నగర్ నుంచి నర్సింగాపూర్ ప్రాజెక్టు లోకి నీటిని విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఇటీవల మహ బూబ్‌నగర్ జిల్లా పాలేమూరి చెరువు నీటి విడుదల సందర్భంగా ప్రజలు ‘వలసపోయి నోళ్లు వాపసొచ్చిండ్రని, కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పండంటూ’ తనను కోరారని తెలిపారు.



రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ బతుకుదెరువు కోసం గల్ఫ్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి నానాకష్టాలు పడుతున్నారని, అలా వలస వెళ్లినోళ్లు వాపసొచ్చి రెండు పంటలు పండిం చుకుని సంతోషంగా జీవించే రోజులొచ్చాయ న్నారు. రైతన్నల కష్టాలను శాశ్వతంగా తీర్చేందుకే సీఎం కేసీఆర్ సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించారన్నారు. మరో నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే ఎల్లంపల్లి ఆయకట్టు కింద 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు ఫ్యామిలీ ప్యాకేజీ (యువత ప్యాకేజీ) కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షలు పరిహారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సంతకం చేశారని చెప్పారు. కేబినెట్ ఆమోదంతో త్వరలోనే నాలుగువేల మందికి పరిహారం అందిస్తామన్నారు. జీవో 123 తీసుకొచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, భూములు ఇచ్చిన పదిహేను రోజుల్లోగానే డబ్బులు చెల్లిస్తామని అన్నారు.

 

కమీషన్లపైనే కాంగ్రేసోళ్లకు ప్రేమ...

కాంగ్రెస్ నాయకులకు కమీషన్లపై ప్రేమ తప్ప.. ప్రజలపై కాదని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు తామే కట్టామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఎందు కు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. పైస లొచ్చే పైపులు, మోటార్లు, మొబిలైజేషన్ అడ్వాన్సు లు తప్ప... ఒక్క పంప్‌హౌస్‌నూ నిర్మించిన పాపాన పోలేదన్నారు. రైతులకు నీళ్లివ్వడం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేదని, అందుకే భూమివ్వ కుండా రైతులను రెచ్చగొడతారని, కోర్టుల్లో కేసులు వేస్తారని మండిపడ్డారు.



కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇంకో పదేళ్లయినా ఎల్లంపల్లి పూర్తయ్యేది కాదన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనా రాయణ, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్.రమేశ్‌బాబు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ప్రాజెక్టుల సీఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

 

మహానేత కల నిజమైన వేళ

ఎల్లంపల్లి నీటి విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ ఆహ్వాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2006లో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి సీఎం హోదాలో ఎల్లంపల్లికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ను గుర్తు చేసుకుం టూ ఫాజుల్‌నగర్ గ్రామస్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ‘‘శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పది సంవత్సరాల క్రితమే రూపకల్పన చేసిన మహానుభావుని కల నిజమైన వేళ... మెట్ట ప్రాంత ప్రజలు మీ యొక్క సేవలు స్మరించుకుంటారు...’’ అంటూ గ్రామస్తులు ఫ్లెక్సీపై వైఎస్‌ఆర్ సేవలను మరోసారి మననం చేసుకున్నారు. సభకు హాజరైన ప్రజలు, అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు సైతం ఆగిమరీ ఫ్లెక్సీని చూసుకుం టూ ముందుకు సాగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top