ధర మండే.. దారి మళ్లే!

LPG Gas Cylinder Prices Hikes in Three months - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎల్పీజీ కమర్షియల్‌ (వాణిజ్య) సిలిండర్ల ధర మండుతోంది. మూడు నెలల్లోనే రూ.90 పెరిగింది. ఫలితంగా 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1470.23కి చేరింది. దీంతో గృహావసరాలకు వినియోగించాల్సిన డొమెస్టిక్‌ సిలిండర్‌ దారి మళ్లుతోంది. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల అవసరాలు తీరుస్తోంది. గ్రేటర్‌లో పెద్ద హోటళ్లు 5వేలకు పైగా ఉండగా... చిన్న హోటళ్లు, టీ, టిఫిన్, మిర్చి సెంటర్లు దాదాపు లక్ష వరకు ఉంటాయని అంచనా. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్లు వినియోగమవుతుండగా.. మిగిలిన చిన్న హోటళ్లు, టీ, టిఫిన్‌ సెంటర్లు, మిర్చి బండ్లు తదితరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. ఈ లెక్కన ప్రతిరోజు లక్ష వరకు డొమెస్టిక్‌ సిలిండర్లు దారి మళ్లుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక టాస్క్‌పోర్స్, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ), పోలీసులు అప్పుడప్పుడు చేసే తనిఖీల్లో ఈ అక్రమదందా వెలుగుచూస్తూనే ఉంది. కానీ వంటగ్యాస్‌ అమలుతీరును పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాల శాఖ నిద్రమత్తులో ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులు వస్తే గానీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. 

కనెక్షన్లు 60 వేలే...   
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి మూడు చమురు సంస్థలకు సంబంధించి మొత్తం వాణిజ్య కనెక్షన్లు 60 వేలకు మించిలేవని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వాణిజ్య  సిలిండర్‌ ధర అధికంగా ఉండడం, డొమెస్టిక్‌ది తక్కువ ఉండడంతో... వ్యాపారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలో డొమెస్టిక్‌ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉంటాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలు ఉండగా.. ప్రతిరోజు 1.50 లక్షల వరకు డొమెస్టిక్‌ సిలిండర్లు అవసరం ఉంటాయి. కానీ ప్రస్తుతం 60 వేలకు మించి డోర్‌ డెలివరీ కావడం లేదని తెలుస్తోంది. కానీ వాణిజ్య అవసరాలకు మాత్రం కొరత లేకుండా బ్లాక్‌ మార్కెట్‌లో లభిస్తుండడం గమనార్హం. ఇక 5కిలోల సిలిండర్‌ ధర కూడా భారీగా ఉంటోంది. దీని ధర బహిరంగ మార్కెట్‌లో రూ.417.78 ఉండగా.. బ్లాక్‌ మార్కెట్‌లో రూ.800 ఉంది. ఎంతోమంది నిరుద్యోగులు, చిన్నాచితక ఉద్యోగులు, విద్యార్థులు నగరానికి వచ్చి ఉంటున్నారు. వీరంతా ఈ చిన్న సిలిండర్లపైనే ఆధారపడి ఉంటారు. వీటికి అధికారికంగా కనెక్షన్లు లేని కారణంగా బ్లాక్‌లోనే గ్యాస్‌ నింపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారంగా వసూల్‌ చేస్తున్నారు.  

కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెరిగిందిలా... 
మార్చి       రూ.1,380.87  
ఏప్రిల్‌        రూ.1,448.50
మే           రూ.1,470.23

గ్రేటర్‌లో ఎల్పీజీ ధరలు ఇలా...
సిలిండర్‌    ప్రభుత్వ ధర    బ్లాక్‌ మార్కెట్‌ ధర
14.2 కిలోల డొమెస్టిక్‌      రూ.768.36     రూ.1,000
19 కిలోల కమర్షియల్‌     రూ.1,470.23  రూ.1,600
5 కిలోల సిలిండర్‌           రూ.417.78    రూ.800

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top