టీడీపీలో ముసలం | Leaders of disagreement Coming to at Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీలో ముసలం

Oct 16 2014 2:47 AM | Updated on Mar 22 2019 6:25 PM

టీడీపీలో ముసలం - Sakshi

టీడీపీలో ముసలం

వలసలు, వరుస ఓటమితో మూలుగుతున్న జిల్లా టీడీపీ నేతల వర్గపోరుతో మరింత డీలా పడుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పని తీరే సరిగా పార్టీలోని ఒక వర్గం నేతలు అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

* మహిళా పెత్తనాన్ని సహించలేకపోతున్న ఓ వర్గం  
* జిల్లా అధ్యక్షురాలి తీరుపై అసంతృప్తి
* త్వరలో చంద్రబాబు వద్దకు అసమ్మతినేతలు

సాక్షి, సంగారెడ్డి:  వలసలు, వరుస ఓటమితో మూలుగుతున్న జిల్లా టీడీపీ నేతల వర్గపోరుతో మరింత డీలా పడుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పని తీరే సరిగా పార్టీలోని ఒక వర్గం నేతలు అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధ్యక్షురాలు శశికళాయాదవ్  సిద్దిపేట డివిజన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తూ తమను విస్మరిస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

జిల్లాలో ఇది వరకే టీడీపీ పరిస్థితిపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఇటీవల జరిగి అన్ని ఎన్నికల్లోనూ టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీనికితోడు ఇటీవల పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆకర్ష్‌మంత్రంతో టీడీపీ జిల్లా, మండల స్థాయి నేతలు గులాబీ గూటికి చేరారు. ఇలాంటి  పరిస్థితుల్లో పార్టీ కేడర్‌లో మనోధైర్యం నింపి పార్టీని నడపాల్సిన జిల్లా ముఖ్యనేతలు గ్రూపు తగాదాలతో బజారున పడుతున్నారు. ప్రస్తుతం పార్టీ నేతలు రెండు వర్గాలు విడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షురాలు పనితీరుపై ఓవర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గజ్వేల్‌కు, దుబ్బాకకు చెందిన సీనియర్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి,  బక్కి వెంకటయ్య కనుసన్నల్లోనే  పార్టీ జిల్లా  అధ్యక్షురాలు పని చేస్తున్నారని  ఓ వర్గం ఆరోపిస్తోంది.

ఇటీవల సంగారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలోనూ నేతల  మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సమావేశానికి ముఖ్యనేతలు సపాన్‌దేవ్ సహా పలువురు నేతలు, ముఖ్య ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. సమావేశంలో వేదికపైకి కొంతమంది నాయకులను ఆహ్వానించి మరికొంత మంది నాయకులను పిలవకపోవడంతో పలువురు నేతలు అసంతృప్తికి లోనయ్యారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి ప్రసంగం ముగియగానే ఇతర నేతలు కూడా ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. అయితే అసంతృప్తి నేతలంతా ఏకమై  జిల్లా అధ్యక్షురాలు ప్రసంగించాక ఇతరులు మాట్లాడటం అనవసరమంటూ వారిని అడ్డుకున్నారు. పార్టీ నుంచి బయటకువెళ్లి ఇటీవలే పార్టీలో చేరిన కొంతమంది నాయకులు తమను అవమానించేందుకే సమావేశంలో  తమ ప్రసంగాన్ని అడ్డుకున్నారని, వారి చిల్లర చేష్టలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు ఒకరు తెలిపారు.
 
ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షురాలు పనితీరుపైనా ఓ వర్గం నాయకులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షురాలు సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తోందని, దీనివల్ల పార్టీని నష్టం చేకూరుస్తోందని అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పెత్తనం చెలాయిస్తున్న ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తితో జిల్లా నేతలు పలువురు త్వరలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement