మధ్యాహ్న భోజనంలో తాజా కూరలు

Kitchen Gardens In Government Schools Mid Day Meal Telangana - Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటు 

10 వేల పాఠశాలలను ఎంపిక చేసిన విద్యా శాఖ 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మరింత ఘుమఘుమలాడనుంది. తాజా కూరగాయలతో వంటలు చేసేందుకు విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్ల నిర్వహణకు ప్రణాళిక రూపొందించింది. అక్కడ పండించిన కూరగాయలనే భోజనంలో వినియోగించేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 27,896 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. స్థలం వెసులుబాటు, నీటి సౌకర్యం ఉన్న పాఠశాలలను విద్యా శాఖ ఎంపిక చేసింది. ఈ ఏడాది 9,958 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటుకు నిర్ణయించింది. 

ప్రయోగాత్మకంగా సక్సెస్‌ 
ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇటీవల సన్న బియ్యంతో భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారు. బియ్యం మినహా మిగతా సరుకులను నిర్వాహకులే కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలు తాజాగా లభించకపోవడం.. ధరలు అధికంగా ఉంటున్నాయనే సాకుతో పలుచోట్ల రుచి సరిగాలేని వంటలనే పెడుతున్నారు. దీంతో పలు చోట్ల విద్యాశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా కూరగాయాలపై దృష్టి సారించిన విద్యాశాఖ కిచెన్‌గార్డెన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గతేడాది 1,203 పాఠశాలల్లో గార్డెన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. అక్కడ సత్ఫలితాలివ్వడంతో రెండో విడతలో కూడా గార్డెన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కిచెన్‌ గార్డెన్ల నిర్వహణ బాధ్యతలు పాఠశాల అభివృద్ధి కమిటీకి అప్పగించింది. విత్తనాల కొనుగోలుకు పాఠశాల గ్రాంటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కిచెన్‌ గార్డెన్లలో టమాటాతో పాటు సోర, దోస, బీర రకాలను సాగుచేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top