పంటకు 'మంట' | Sakshi
Sakshi News home page

పంటకు 'మంట'

Published Mon, Oct 30 2017 12:55 AM

Huge shocks to the cotton farmers

సాక్షి, హైదరాబాద్‌/తల్లాడ/బోయినపల్లి/బేల: ఇటు ప్రకృతి.. అటు పురుగులు.. ఓ వైపు వ్యాపారుల మాయాజాలం.. మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం.. నలువైపుల నుంచీ దాడితో పత్తి రైతు చిత్తవుతున్నాడు. ప్రకృతి పగబట్టి నట్లుగా అవసరమైనప్పుడు వాన కురవక.. వద్దనుకున్నప్పుడు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాడు. సీజన్‌లో తొలుత మంచి వర్షాలు కురిశాయని విత్తనాలు వేస్తే.. ఆ తర్వాత వర్షాలు కురవక కొంత, నాసిరకం విత్తనాలతో మొలకెత్తక మరికొంత నష్టపోయాడు.

తర్వాత వర్షాల మధ్య విరామం (డ్రైస్పెల్‌)తో గులాబీరంగు కాయతొలుచు పురుగు ఉధృతంగా సోకి పత్తిపంట దెబ్బతిన్నది. ఇంతా చేసి దిగుబడి దశ దాకా వస్తే.. అనవసర సమయంలో అధిక వర్షాలు పడి పత్తి రంగు మారింది, తేమ శాతం పెరిగిపోయింది. ఆఖరుకు మిగిలిన ఆ కాస్త పత్తినీ మార్కెట్‌కు పట్టుకొస్తే.. వ్యాపారుల మాయాజాలం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, సీసీఐ అడ్డగోలు నిబంధనలు మరింతగా కుంగదీశాయి. కనీసం పత్తి ఏరే కూలీలకు సరిపడా సొమ్ముకూడా రాని దుస్థితిలో రైతులు పంట పండించిన చేతులతోనే దానికి నిప్పు పెడుతున్నారు. పత్తి ఏరడం కూడా వృథా అనుకుంటూ కన్నీళ్లతో పంటను దున్నేస్తున్నారు.

పండించిన చేతితోనే నిప్పు
గులాబీ పురుగు ఉధృతితో పంట దెబ్బతినడంతో ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ రైతులు పత్తి పంటకు నిప్పు పెట్టారు. ఆదివారం గ్రామానికి చెందిన సామ నర్సారెడ్డి 9 ఎకరాలు, ఉపేందర్‌ 6, సునీల్‌ 5, కన్నె గణేశ్‌ 9 ఎకరాల్లో పత్తి చేనును దహనం చేశారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం ఖాదర్‌గూడెంకు చెందిన ఔరగొండ పోశయ్య ఆరున్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. పంట దెబ్బతిని, దిగుబడి సరిగా లేక.. పంట మొత్తాన్ని తొలగించి దహనం చేసేశారు. సాగు పెట్టు బడి కోసం చేసిన అప్పులు భారం మిగిలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీసీఐ నిబంధనల శాపం
పత్తి కొనుగోళ్లకు సంబంధించి భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) విధించిన నిబంధనలు కఠినంగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవలి వర్షాలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పత్తి నల్లబడింది. అటు వాతావరణంలో మార్పులతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో నిబంధనలకు అనుగుణంగా లేదంటూ సీసీఐ పత్తిని కొనుగోలు చేయడం లేదు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ. 4,320కు, 9 శాతముంటే రూ. 4,277కు, 10 శాతముంటే రూ. 4,234, 11 శాతముంటే రూ. 4,190కి, 12 శాతం తేమ ఉంటే రూ. 4,147కు కొనుగోలు చేయాలి. అంతకుమించి తేమ శాతం ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి నాణ్యంగా ఉన్నా గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో పత్తిలోనూ తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దానిని సాకుగా చూపుతూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు పత్తికి రూ.3 వేల నుంచి రూ.4 వేలలోపే చెల్లిస్తూ రైతులను దగా చేస్తున్నారు.

కేంద్రంలో చలనం లేదు: హరీశ్‌రావు
తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని, రంగు మారిన పత్తిని బీ, సీ గ్రేడ్‌ల కింద సీసీఐ కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం లో చలనం లేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం పత్తి రైతులకు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పత్తి రైతుల సమస్యలపై ఆదివారం సచివాల యంలో జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సెప్టెం బర్, అక్టోబర్‌లలో కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట దెబ్బతి న్నదని చెప్పారు. పత్తి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందుకు పూర్తి సహకారం అందించాలని జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులను కోరారు. నాణ్యమైన పత్తిని మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని.. రంగు మారిన, ఎక్కువ తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తేమ శాతం ఒకసారి నిర్ణయించాక మళ్లీ ఎక్కువ తక్కువంటూ కోతలు వేయవద్దని, చార్జీల పేరి సొమ్ము వసూళ్లు చేయకూడదని సూచించారు.

రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇక ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలకు సంబంధించి జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించారని.. వాటిని సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హరీశ్‌రావు చెప్పారు. రైతులు కూడా తొందరపడి తక్కువ ధరకు పత్తి అమ్ముకోవద్దని.. త్వరలోనే పత్తికి మంచి డిమాండ్‌ ఉంటుం దని సూచించారు. రాష్ట్రంలో 80 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, 120 జిన్నింగ్‌ మిల్లులను కూడా కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించినట్టు హరీశ్‌రావు చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జిన్నిం గ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మార్కెటింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు.

గత్యంతరం లేకనే.. 
‘‘సరిగా దిగుబడి లేకపోవడం, అక్కడక్కడా వచ్చిన కొద్ది పత్తి కూడా తీయాలంటే కూలీల ఖర్చుకు కూడా సరిపోయేలా లేదు. అందుకే పత్తి పంటను తీసేస్తున్నాం..’’ 
    – గొడుగునూరి లక్ష్మీరెడ్డి, రైతు 

వర్షాలతో పంట దెబ్బతింది 
‘‘ఈసారి పత్తి బాగా ఎదిగింది. కానీ అధిక వర్షాలతో పూత, పిందె రాలిపోతోంది. కొద్దిగా నిలిచినా ఉపయోగం కనిపించట్లేదు. అందుకే తొలగిస్తున్నాం..’’      
– వేమిరెడ్డి గురవారెడ్డి, రైతు 

ఆశ చచ్చి.. కడుపు మండి..
గతేడాది రాష్ట్రంలో పత్తికి మంచి డిమాండ్‌ కనిపించింది. మద్దతు ధరకు మించి మరీ రైతుకు గిట్టుబాటు అయింది. దాంతో ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా రైతులు పత్తి పంట వైపు మొగ్గుచూపారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా పత్తి సాగయింది. కానీ ప్రకృతి సహకరించలేదు. తొలుత వర్షాలు బాగానే కురిసినా.. తర్వాత డ్రైస్పెల్‌ ఏర్పడటం, గులాబీ కాయతొలుచు పురుగు దాడి, పత్తి దిగుబడి దశలో వర్షాలతో పంట బాగా దెబ్బ తినిపోయింది. దాంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. చివరికి పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆశ చచ్చిపోయి.. కడుపు మండిన రైతులు తాము పండించిన పంటను తమ చేతులతోనే తొలగించేస్తున్నారు.

ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో నిమ్మ అంజిరెడ్డి అనే రైతు మూడెకరాల్లోని పత్తి పంటను ట్రాక్టర్‌తో దున్నించేశారు.  పంట ఇటీవలి వర్షాలతో రంగు మారింది. ఏరి విక్రయించినా కనీస ధర కూడా లభించే రిస్థితి లేదని.. సమీపంలోని మార్కెట్‌ యార్డుల్లో ఉన్న సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాలేదని.. దాంతో పంటను తొలగించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ పరిసరాల్లోని పలువురు రైతులు కూడా కొద్దిరోజులుగా పత్తి పంటను ట్రాక్టర్లు, రోటవేటర్లతో దున్నించేస్తున్నారు. నారాయణపురం, తల్లాడ గ్రామాల్లో ఇప్పటికే 30 మంది రైతులు వంద ఎకరాల్లో పత్తికి కలుపు మందు కొట్టి దున్నించారు. పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement