ఉప సర్పంచ్‌ ఎన్నికలో హైడ్రామా | high drama in panchayat election in shamshabad | Sakshi
Sakshi News home page

ఉప సర్పంచ్‌ ఎన్నికలో హైడ్రామా

Feb 3 2018 5:06 PM | Updated on Aug 14 2018 2:50 PM

high drama in panchayat election in shamshabad - Sakshi

మండలంలోని పాల్మాకుల పంచాయతీ కార్యాలయం భవనం

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌) : మండలంలోని పాల్మాకుల పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. అవిశ్వాస తీర్మాణంతో ఉప సర్పంచ్‌ పదవి కోల్పోగా.. ఆ తర్వాత చోటుచే సుకుంటున్న వరుస ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఖాళీ అయిన వార్డుకు ఉప ఎన్నిక నిర్వహించిన రెండు రోజులకే మరో వార్డు సభ్యుడు రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పంచాయతీలో మొత్తం 14 వార్డులుండగా.. గతేడాది సెప్టెంబరు 26న ఉప సర్పంచ్‌ హరీందర్‌గౌడ్‌పై అవిశ్వాసం పెట్టారు. 9 మంది వార్డు సభ్యులు, సర్పంచ్‌ సరిత అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. కొత్తగా ఉప సర్పంచ్‌ ఎన్నికను అడ్డుకునేందుకు.. హరీందర్‌గౌడ్‌ వర్గీయులు ఎత్తులు వేశారు. పంచాయతీ 3వ వార్డు స్థానానికి సభ్యురాలు బాలమణి గత అక్టోబరు 10న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా.. గత నెల 29న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్‌ ఎన్నిక జరపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో హరీందర్‌గౌడ్‌ వర్గీయులు కొత్త షాక్‌ ఇచ్చారు. రెండు రోజుల కిందట పంచాయతీ 5వ వార్డు సభ్యుడు నవీన్‌కుమార్‌ రాజీనామాను ఎంపీడీఓకు అందజేశారు. వార్డు స్థానం ఖాళీ ఉండగా.. ఉప సర్పంచ్‌ ఎన్నిక జరిపే అవకాశం లేదనే ఆలోచనతో రాజీనామా చేయించినట్లు సమాచారం.  

ఇది వరకే నోటిఫికేషన్‌ జారీ..
ఉప సర్పంచ్‌ ఎన్నికను వాయిదా వేయడానికి హరీందర్‌గౌడ్‌ వర్గీయులు పావులు కదువుతుండగా.. అప్పటికే నోటిఫికేషన్‌ జారీ కావడం గమనార్హం. గత నెల 29న వార్డు స్థానానికి ఉప ఎన్నిక పూర్తయిన మరుసటి రోజు 30వ తేదీన ఉప సర్పంచ్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 9న ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్‌ రాగా.. తాజాగా మరో వార్డు సభ్యుడు రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వార్డు స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో ఉప సర్పంచ్‌ ఎన్నిక జరిపే అవకాశాలు ఎంత వరకు అనుకూలంగా ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగా.. వార్డు సభ్యుడు చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందనట్లు సమాచారం.

న్యాయ సలహా తీసుకుంటాం
పాల్మాకుల పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ జారీ అయింది. అయితే వార్డు సభ్యుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నికను జరిపే అంశాన్ని న్యాయ సలహా మేరకు ముందుకు వెళ్తాం.  – ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement