డాక్టర్‌ ఫీజుల మోత! | Ground Prepare for the increase of fees in private medical and dental colleges | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ఫీజుల మోత!

Jul 1 2019 2:55 AM | Updated on Jul 1 2019 2:55 AM

Ground Prepare for the increase of fees in private medical and dental colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో బీ కేటగిరీ, సీ కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) కోటా సీట్లల్లో 5 శాతం ఫీజులు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గతేడాది ఐదు శాతం ఫీజు పెంచినా ఆ ఏడాదికే పరిమితం చేశారని, కాబట్టి ఈ ఏడాది మరో ఐదు శాతం ఫీజు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖ రాసినట్లు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు ‘సాక్షి’కి తెలిపారు. పెంపుపై అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఏటా ఐదు శాతం ఫీజులు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఆ మేరకు ఈసారి కూడా ఫీజులు పెరుగుతాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు కూడా స్పష్టం చేశాయి.  

ఏడాదికి బీ కేటగిరీకి రూ. 57 వేలు, ఎన్‌ఆర్‌ఐ రూ. 1.15 లక్షలు అదనం... 
రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండగా అందులో నాలుగు మైనారిటీ మెడికల్‌ కాలేజీలున్నాయి. మైనారిటీ మెడికల్‌ కాలేజీలకు ఏడాదికి 5 శాతం పెంపు నిబంధన వర్తించదు. కాబట్టి మిగిలిన 17 మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ సీట్లకు ఫీజుల పెంపు ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇవిగాక ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లోనూ 5 శాతం ఫీజుల పెంచుకునే నిబంధన వర్తిస్తుంది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని వైద్య సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు ఉంటాయి. ఇక 35 శాతం బీ కేటగిరీ సీట్లు ఉంటాయి. మరో 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేసుకునే వీలుంది. ఇప్పుడు బీ, సీ కేటగిరీ సీట్లకు ఫీజు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉంది. ఐదు శాతం పెంచితే రూ. 57,750 మేర పెరగనుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్‌ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 12,12,750 కానుంది. ఇక సీ కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుంది. ఐదు శాతం పెంచితే అదనంగా రూ. 1,15,500 కానుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్‌ సీ కేటగిరీ ఫీజు రూ. 24,25,500 కానుంది. అలాగే డెంటల్‌ కోర్సులకూ ఐదు శాతం మేర ఫీజు పెరగనుంది. ఐదేళ్లకు కలిపి చూస్తే పెంచిన ఫీజుల భారం విద్యార్థులపై అధికం కానుంది. కన్వీనర్‌ కోటా సీట్లలో మొదటి విడత ప్రవేశాలకు రాష్ట్రంలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రా రంభమైంది. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఆ తర్వాత సీట్ల ఎంపిక పూర్తి చేస్తారు. అనంతరం రెండో విడత కన్వీనర్‌ కోటాకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఆ సమయంలోనే బీ కేటగిరీ సీట్లకు కూడా నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఆలోగా ఫీజుల పెంపుపై స్పష్టత ఇవ్వాలని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి.  

బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్‌ సీట్లు 1250... 
ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2019–20లో మొత్తంగా 4,600 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్‌ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.  4 మైనారిటీ కాలేజీల సీట్లు పోను మిగిలిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2,500 సీట్లున్నాయి.  కన్వీనర్‌ కోటా సీట్లు 1,250 పోను మిగిలినవి బీ, సీ కేటగిరీకి చెందినవి ఉన్నాయి. బీ కేటగిరీ ఎంబీబీఎస్‌ సీట్లు 875 కాగా, ఎన్‌ఆర్‌ఐ కోటా ఎంబీబీఎస్‌ సీట్లు 375 ఉన్నాయి. ఈ 1,250 సీట్లకు ఫీజులను పెంచేందుకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు రంగం సిద్ధం చేశాయి. ఇక 11 ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లోనూ 1,140 బీడీఎస్‌ సీట్లున్నాయి. సగం బీ, సీ కేటగిరీ సీట్లుకాగా వాటికి కూడా 5 శాతం మేర ఫీజులు పెరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement