పరశురాములుకు తొలి ‘పాయింట్‌’ | First point for parashuramulu over Helmet rule | Sakshi
Sakshi News home page

పరశురాములుకు తొలి ‘పాయింట్‌’

Aug 2 2017 2:05 AM | Updated on Sep 17 2017 5:03 PM

పరశురాములుకు తొలి ‘పాయింట్‌’

పరశురాములుకు తొలి ‘పాయింట్‌’

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనులకు పెనాల్టీ పాయింట్లు విధించే విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది.

హెల్మెట్‌ లేనందుకు విధించిన ట్రాఫిక్‌ పోలీసులు
గ్రేటర్‌లో అమలులోకి ‘ట్రాఫిక్‌’పాయింట్ల విధానం


సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనులకు పెనాల్టీ పాయింట్లు విధించే విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు తమ తమ పరిధుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ.. చలాన్‌ టికెట్‌ జారీ చేయడంతో పాటు పాయింట్లు వడ్డించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును సంయుక్త పోలీసు కమిషనర్‌ వి.రవీందర్‌ స్వయంగా పర్యవేక్షించారు. నగరానికి సంబంధించి తొలి పాయింట్‌ను నల్లకుంట పోలీసులు విధించారు. మంగళవారం ఉదయం 10.49 గంటల ప్రాంతంలో హెల్మెట్‌ లేకుండా టీఎస్‌07ఎఫ్‌డీ3298 రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కలిగిన వాహనంపై వస్తున్న ద్విచక్ర వాహనచోదకుడు పరశురాములును సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ బి.రాజునాయక్‌ నల్లకుంట ప్రాంతంలో ఆపారు. ఆయనకు చలాన్‌ జారీ చేయడంతో పాటు ఒక పెనాల్టీ పాయింట్‌ విధించారు.

మంగళవారం రాత్రి 8 గంటల వరకు సిటీ ట్రాఫిక్‌ పోలీసులు మొత్తం 1,324 మంది వాహనచోదకులకు 1,493 పెనాల్టీ పాయింట్లు విధించారు. కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగు వరకు ఈ పాయింట్లు పడ్డాయి. వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహన చోదకులకు, హెల్మెట్‌ ధరించని ఉల్లంఘనపై విధించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో మధ్యాహ్నం, సైబరాబాద్‌లో సాయంత్రం పాయింట్ల విధింపు ప్రక్రియ ప్రారంభమైంది. మూడు కమిషరేట్లలోనూ క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ వద్ద ఉన్న పీడీఏ మిషన్ల ద్వారా పెనాల్టీ పాయింట్లను వాహనచోదకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్‌ ఆధారంగా నమోదు చేశారు. తొలి పాయింట్‌ పడిన నాటి నుంచి 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే సదరు వాహనచోదకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏడాది పాటు సస్పెండ్‌ అవుతుంది.

నమోదైన కేసుల్లో విధించిన పెనాల్టీ పాయింట్లు ఇవీ..
వాహన రకం                 కేసులు         విధించిన పాయింట్లు

ద్విచక్ర వాహనాలు        1,239            1,346
త్రిచక్ర వాహనాలు           13                23
తేలికపాటి వాహనాలు    33                  47
భారీ వాహనాలు            39                 77
మొత్తం                     1,324              1,493
– ఓ వాహనంపై ఒకే కేసు నమోదు చేసినా.. ఉల్లంఘనను బట్టి ఒకటి కంటే ఎక్కువ పాయింట్లు విధించే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య కంటే పాయింట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement