పరిహారం.. పరిహాసం.. | farmers have concern on crop compensation | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం..

Oct 20 2014 2:33 AM | Updated on Jun 4 2019 5:04 PM

అన్నదాతలు పంట నష్ట పరిహారం కోసం కాళ్లరిగేలా వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ.. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అన్నదాతలు పంట నష్ట పరిహారం కోసం కాళ్లరిగేలా వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ.. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగేళ్లకు సంబంధించి అధిక వర్షాలతో, వడగండ్లతో పంటనష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ఆగస్టులో మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,40,618 మంది రైతులకు సంబంధించి 2011 నుంచి 2014 వరకు గాను పెండింగ్‌లో ఉన్న రూ.69.12 కోట్లు పరిహారాన్ని జీవో 6, 7 ద్వారా విడుదల చేసింది. కాగా.. నష్టపరిహారం మంజూరై రెండు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రైతులకు పరిహారం అందలేదు.

ఇప్పటి వరకు కేవలం 93 వేల మంది రైతులకు రూ.40 కోట్ల 50 లక్షల 805 మాత్రమే వారి ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన 47,618 మంది రైతులకు రూ.29 కోట్ల వరకు అందించాల్సి ఉండగా, ఇందులో 13,618 మంది రైతుల ఖాతా వివరాలు సరిగా లేవనే సాకుతో వారికి సంబంధించిన రూ.10 కోట్లు వెనక్కి పంపించారు. ఇక మిగతా 25 వేల మంది రైతులకు రూ.19 కోట్లు నష్టపరిహారాన్ని త్వరలో అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

అర్హులైన వారి పేర్లు గల్లంతు..
పంట నష్టపరిహారానికి అర్హులైన రైతుల పేర్లు సైతం అధికారులు తయారు చేసిన జాబితాలో గల్లంతు కావడం గమనార్హం. దీంతో తమ పంట నష్టపోయినా పరిహారం చెల్లించలేదని రైతులు ఆందోళనబాట పట్టారు. అనర్హులైన రైతులకు మాత్రం నష్టపరిహారం కింద డబ్బులు జమ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ (టి), దహెగాం, బెజ్జూర్, కాగజ్‌నగర్‌కు చెందిన రైతులు పరిహారం జాబితాల్లో పేర్లు లేవంటూ గత నెలలో ఆందోళన చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి జాబితాపై పునఃపరీశీల చేస్తున్నారు.

పంట నష్టం వాటిల్లినప్పుడు పేర్లు రాసుకున్న రైతులకు కాకుండా పంటలు వేసుకోని వారి పేర్లు, వారి కుంటుంబంలో ఎంతమందికి భూమి ఉంటే అంతమందికి పరిహారం జాబితాల్లో చోటు కల్పించడంపై విస్మయానికి గురవుతున్నారు. ఆ సమయంలో పంటనష్టం వివరాలు సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులు, ఆదర్శ రైతులు అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో భూమిలేని కుటుంబాలు, ఒకే కుటుంబంలోని ముగ్గురు నుంచి నలుగురు సభ్యుల పేర్లు ఉండడం, వారి నుంచి బ్యాంక్ ఖాతాలు తీసుకుని పరిహారం జమ చేయడం అనుమానాలకు దారితీస్తోంది. ఈ అక్రమాల్లో అధికారులతోపాటు, ఆదర్శ రైతులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.

ఖాతా నెంబర్లు అందక వెనక్కి..
రైతుల ఖాతా నెంబర్ల వివరాలు సరిగా పొందుపరుచక రూ.10 కోట్లు వెనక్కి వెళ్లాయి. పంట నష్టం జరిగినప్పుడు రైతు పేర్లు సరిగా లేకపోవడం.. ఖాతానెంబర్లు ఇవ్వకపోవడంతోనే పరిహారం తిరిగి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి బెజ్జూర్, కౌటాల మండలాల్లోని పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అయినా.. ఆయా ప్రాంతాల రైతుల పేర్లు పరిహారం జాబితాలో లేకపోవడం గమనార్హం. దీంతో గత నెలలో ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై వ్యవసాయ సంయుక్త సంచాలకులు రోజ్‌లీలాను వివరణ కోరగా.. అర్హులందరికీ పరిహారం జమ చేస్తామని చెప్పారు. ఏడీఏ, ఏవోల ద్వారా పునఃపరిశీలిస్తున్నామని, త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement