ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్‌! 

Electricity To Kaleshwaram Irrigation Project Under Special Category - Sakshi

కాళేశ్వరంపై ఈఆర్సీ అనుమతి కోరనున్న డిస్కంలు

తక్కువ ధరతో విద్యుత్‌ సరఫరాకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ‘ప్రత్యేక కేటగిరీ’కింద విద్యుత్‌ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 కేవీల భారీ లోడ్‌తో విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉండటంతో ఇందు కోసం కొత్త కేటగిరీని సృష్టించనుంది. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టులకు హెచ్‌టీ–4 (ఏ) కేటగిరీ కింద యూనిట్‌కు రూ.5.8 చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. 11కేవీ, 33 కేవీ, 132 కేవీ లోడ్‌ లోపు విద్యుత్‌ సరఫరాకు ఈ కేటగిరీ వర్తిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయితే రోజుకు 3 టీఎంసీ ల నీటిని తరలించేందుకు గరిష్టంగా 7,152 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయాల్సి వస్తుంది.

ఇంత భారీ మొత్తంలో విద్యుత్‌ను 400 కేవీ లోడ్‌తో సరఫరా చేస్తారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాల కోసం విద్యుత్‌ సరఫరా కోసం కొత్త కేటగిరీ సృష్టించాలని సీఎం కేసీఆర్‌  అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కొత్త కేటగిరీ కింద విద్యుత్‌ టారీఫ్‌ ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించనున్నాయి. 2019–20కు సంబంధించి త్వరలో ఈఆర్సీకి సమర్పించనున్న వార్షిక టారీఫ్‌ ప్రతిపాదనల్లో కొత్త కేటగిరీని చేర్చే అవకాశముంది. కొత్త కేటగిరీ కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ ధరకే విద్యుత్‌ సరఫరా చేసే అవకాశం ఉంది. 

ఒకట్రెండేళ్ల తర్వాతే స్పష్టత 
కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్‌ వ్యయభారంపై ఒకట్రెండేళ్లు గడిచిన తర్వాతే స్పష్టత రానుందని ట్రాన్స్‌కో అధికార వర్గాలు చెబుతున్నాయి. నీటిపారుదల శాఖ కోరిన మేరకు సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్‌ను సమీకరించి పెట్టుకున్నా, వాస్తవానికి వినియోగం ఎంతో ఇప్పుడే చెప్పలేమంటున్నాయి. ఇంకా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల నీటినే తరలిస్తారు. దీంతో ఈ ఏడాది 3,800 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించాలని నిర్ణయించడంతో 4,992 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గరిష్టంగా 7,152 మెగావాట్ల విద్యుత్‌ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు అవసరాల కోసం ఏటా 13,558 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని ప్రాజెక్టు డీపీఆర్‌లో అంచనా వేశారు. ఒకటి రెండేళ్లు గడిస్తే ప్రాజెక్టు విద్యుత్‌ వినియోగంపై స్పష్టత వస్తుందని, అప్పుడు విద్యుత్‌ వ్యయ భారంపై స్పష్టత వస్తుందని అధికారవరాలు చెబుతు న్నాయి. కొత్త కేటగిరీ కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా చేసే విద్యుత్‌ టారీఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించాల్సి ఉంది.

యూనిట్‌కు రూ.3 చొç ³్పున తక్కువ ధరతో విద్యుత్‌ సరఫరా చే యాలని నిర్ణయించినా, డీపీఆర్‌ అంచనాల ప్ర కారం ఈ ప్రాజెక్టు విద్యుత్‌ చార్జీల వ్యయం ఏటా రూ.4,067 కోట్లు కానున్నాయి. యూనిట్‌కు రూ.4 చొప్పున విద్యుత్‌ సరఫరా చేయా లని నిర్ణయిస్తే, ఏటా రూ.5,423 కోట్ల విద్యుత్‌ వ్యయం కానుంది. యూనిట్‌కు రూ.5 చొప్పున విద్యుత్‌ సరఫరా చేయాలని కోరితే ఏటా రూ. 6,779 కోట్ల విద్యుత్‌ చార్జీలు కానున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top